KCR : ఒక్క క్షణం చాలు తలరాత తలకిందులు అయ్యేందుకు. ఆరు నెలల క్రితం తెలంగాణలో నెంబర్ వన్ పార్టీగా, పదేళ్లు రాష్ట్రాన్ని పాలించిన పార్టీ ఇప్పుడు ఒక్క అడుగు ముందు కేసేందుకే నానా ఇబ్బందులు పడుతోంది. అవును, ఈ చర్చ ముమ్మాటికీ కే చంద్రశేఖర్ రావు నేతృత్వంలోని భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) గురించే.
గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో హోర ఓటమి బీఆర్ఎస్ పతనానికి మొదటి పాయింట్. ఆ తర్వాత వరుస ఆరోపణలు ఆ పార్టీ నేతలను చుట్టుముట్టాయి. పార్టీ సీనియర్ ఎమ్మెల్యేలు, నేతలు చాలా మంది కాంగ్రెస్ లేదా బీజేపీలోకి వెళ్లిపోయారు.
అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ బీఆర్ఎస్ ను టార్గెట్ చేస్తూ గత ప్రభుత్వం చేసిన కుంభకోణాలను ఒక్కొక్కటిగా బయట పెట్టడం ప్రారంభించింది. ఇది లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బలం పెంచింది. ఇది ఒక వైపు అయితే మరో వైపు నరేంద్ర మోడీ హవాను బీఆర్ఎస్ తట్టుకోలేకపోయింది. ముఖ్యంగా కేసీఆర్ కూతురు కవిత కేసు పార్లమెంట్ ఎన్నికల విజయావకాశాలకు భారీగా దెబ్బకొట్టాయి.
అయితే, లోక్ సభ ఎన్నికల ముందు ఆమెను అరెస్ట్ చేయడం కూడా బీఆర్ఎస్ ఓట్లను బీజేపీ వైపు మళ్లించడంలో ప్రభావం చూపింది. రేవంత్ రెడ్డి స్వయంగా ప్రతీ నియోజకవర్గంలో పర్యటిస్తూ కాంగ్రెస్ ప్రచారానికి నాయకత్వం వహించారు. బీజేపీ హిందుత్వ రాజకీయాల గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు కొన్ని వర్గాల్లో ఓట్లను పొందడానికి సహాయపడ్డాయి.
మరోవైపు అసెంబ్లీలో తమ పార్టీ ఓడిపోవడం ప్రజలు చేసిన తప్పిదంగా కేసీఆర్, ఆ పార్టీ నేతలు అభివర్ణించారు. అన్ని నియోజకవర్గాల్లో ఓటర్లకు లంచం ఇచ్చేందుకు ప్రయత్నించినట్లు సమాచారం. కానీ వారి ప్లాన్స్ వర్కవుట్ కాలేదు. కేసీఆర్ బస్సు యాత్ర కూడా ఎలాంటి ప్రభావం చూపకపోవడంతో ఆ పార్టీకి లోక్ సభలో ఒక్క సీటు కూడా దక్కలేదు.
తెలంగాణ ఉద్యమ సమయం, ఆ తర్వాత రెండు సార్లు ప్రభుత్వం ఏర్పాటుకు ముఖ్యంగా కేసీఆర్ స్పీచే కారణం. కానీ, 2023 అసెంబ్లీ ఎన్నికలు, 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఆయన ఎటువంటి ప్రభావం చూపించలేకపోయారు. కేసీఆర్ గురించి ఓటర్లకు పూర్తిగా అవకాగాహన అయ్యింది విశ్లేషకులు చెప్తున్నారు.
బీఆర్ఎస్ చేసిన అవినీతిని, కేసీఆర్ అరాచక వ్యక్తిత్వాన్ని తెలంగాణ ప్రజలు పూర్తి వ్యతిరేకంగా మారారని పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో ఓట్లను రాబట్టడంలో సోషల్ మీడియా కూడా ప్రధాన పాత్ర పోషించింది. బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా బీజేపీ, కాంగ్రెస్ సోషల్ మీడియాను బాగా ఉపయోగించుకున్నాయి.
రానున్న రోజుల్లో మరింత మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు జాతీయ పార్టీల్లోకి వెళ్లే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ప్రస్తుతం ఆ పార్టీ అట్టడుగు దశలో ఉంది. మరి కేసీఆర్ ఇక్కడి నుంచి ఎలా గట్టెక్కిస్తారో చూడాలి. ప్రస్తుతానికి ఆయన కారు టైర్లన్నీ కాంగ్రెస్, బీజేపీలు ‘పంక్చర్’ చేశాయి. ఇక రానున్న జీహెచ్ఎంసీలో కూడా బీఆర్ఎస్ పార్టీ పెద్దగా పర్ఫార్మెన్స్ చేసే అవకాశం లేదని, ఎందుకంటే అక్కడ ఎక్కువగా బీజేపీ, రెండో ప్లేస్ లో కాంగ్రెస్ మాత్రమే ఉండబోతున్నాయని విశ్లేషకులు అంచనాలు వేస్తున్నారు.