America : భారతీయ యువతకు అమెరికా అంటే ఎప్పుడూ క్రేజే. అమెరికాలో చదువుకోవాలని, అక్కడే ఉద్యోగం చేయాలని..కలలుకంటుంటారు. ఇక కొందరు ఆడపిల్లల తల్లిదండ్రులైతే తమ కూతుళ్లకు అమెరికా సంబంధమే కావాలని ఎదురుచూస్తుంటారు. యువతకే కాదు తల్లిదండ్రులకు కూడా అమెరికా అంటే ఆసక్తే.
మన భారతీయులకు అమెరికా అంటే ఇష్టం ఇప్పటిదే కాదు..దశాబ్దాలుగా ఉన్నదే. ఇక్కడి రాజకీయాలు, అవినీతి, ప్రోత్సాహ లేమి..వంటివి భారత్ నుంచి అమెరికా మేధోవలస సాగుతోంది. అమెరికాలో మంచి జీతం, గుర్తింపు ఉండడంతో చాలా మంది అక్కడే స్థిరపడిపోయారు. అమెరికాలో జీవించడానికి అనువైన పరిస్థితులు ఉంటాయి. అలాగే అక్కడ లక్షల్లో భారతీయులు ఉండడం.. అక్కడ కొన్ని ఏరియాల్లో ఉంటే అమెరికాలో ఉన్నామా ఇండియాలో ఉన్నమా అర్థం కాదు. ఎటు చూసినా మనవాళ్లే కనపడుతుంటారు.
అయితే ప్రస్తుతం అమెరికాలో నెలకొన్న ఆందోళనకర పరిస్థితులతో ఆ కల చెదిరిపోతున్నట్టు కనిపిస్తోంది. కొవిడ్ తర్వాత పరిస్థితులు చాలా మారిపోయాయని, గత కొన్ని సంవత్సరాలుగా టెక్ రంగంలో జాబ్ మార్కెట్ లో మందగమనం నెలకొనగా, అదే విధంగా కాలేజీ ట్యూషన్ ఫీజులు విపరీతంగా పెరగడంతో ఇప్పటికే చాలా మంది అమెరికా చదువంటే వెనకడుగు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లడంపై పునరాలోచన చేస్తున్నారు. మరీ ముఖ్యంగా మాస్టర్ డిగ్రీ పొందాలనుకుంటున్న విద్యార్థులు ఈ ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈమేరకు పలువురు పెడుతున్న పోస్టులు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
తాజాగా ఓ వ్యక్తి చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. ‘‘అమెరికాలో టెక్ ఉద్యోగాల స్వర్ణయుగం ముగిసింది. మీరు డిగ్రీ పట్టుకుని ఈ పరిస్థితుల్లో అమెరికా రావాలనుకుంటే సమయం, డబ్బు వృథా చేసుకోవడమే తప్ప ఏమీ ఉండదు. అధిక ఫీజులు, తక్కువ వేతనాలు, లాటరీలో హెచ్ 1 బీ వీసా పొందే అవకాశం చాలా తక్కువగా ఉండడం.. గ్రీన్ కార్డు పొందే అవకాశం లేకపోవడమే ఇందుకు కారణం’ అని పోస్ట్ లో పేర్కొన్నాడు.
లక్షలాది మంది ఎంఎస్ కోసం అమెరికా వస్తున్నారని, కోర్సు పూర్తయిన తర్వాత అందరికీ ఉద్యోగాలు రావడం అనేది కలేనని మరొకరు ట్వీట్ చేశారు. మొత్తానికైతే అమెరికాలో పరిస్థితులు బాగోలేవని, యువత మరో దారి చూసుకోవాలని తెలుస్తోంది. అవసరమైతే మన ఇండియాలోనే మంచి ఉద్యోగం చూసుకుని, మనవాళ్ల మధ్య ఉంటూ దేశానికి సేవలు చేస్తే బెటర్ అని చెప్పవచ్చు.