Chandrababu : చంద్రబాబు కేసుల్లో ఏం జరుగబోతోంది..? ఈరోజు అత్యంత కీలకమా..

What is going to happen in Chandrababu's cases?

What is going to happen in Chandrababu’s cases?

Chandrababu : ఏపీలో ఎన్నికల వేళ కేసుల రాజకీయం నడుస్తోంది. టీడీపీ అధినేత చంద్రబాబుపై సీఐడీ నమోదు చేసిన కేసుల్లో కీలక పరిణామాలు మొదలయ్యాయి. స్కిల్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటీషన్ పై సుప్రీం కోర్టు తీర్పు వెలువరించింది. 17ఏ పైన మాత్రం ఇద్దరు న్యాయమూర్తులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. అరెస్ట్, రిమాండ్ విషయంలో చంద్రబాబు వాదనతో ఏకీభవించలేదు. ఈ రోజు సుప్రీంలో చంద్రబాబు ఫైబర్ నెట్ తీర్పుపై ఉత్కంఠ కొనసాగుతోంది.

చంద్రబాబు స్కిల్ కేసులో ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. మరో మూడు కేసుల్లో ముందస్తు బెయిల్ ఇచ్చింది. స్కిల్ కేసుల్లో చంద్రబాబు బెయిల్ పై సీఐడీ సుప్రీంను ఆశ్రయించింది. దీనిపైన సుప్రీం నిర్ణయం వెలువరించాల్సి ఉంది.

తాజాగా చంద్రబాబు స్కిల్ కేసులో దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై ఇద్దరు న్యాయమూర్తులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేయడంతో దానిని మరో ధర్మాసనానికి పంపాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏ ధర్మాసనం ముందుకు పంపాలో ప్రధాన న్యాయమూర్తి నిర్ణయిస్తారు. ఆ ధర్మాసనం ముందు మరోసారి వాదనలు జరగాల్సి ఉంటుంది. ఆ తర్వాత తుది నిర్ణయం వెలువడుతుంది. దీనికి కొన్ని నెలల సమయం పట్టే అవకాశం ఉంటుంది.

ఇటు ఫైబర్ నెట్ కేసులో బెయిల్ కోసం చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీం బుధవారం నిర్ణయం వెలువరించే అవకాశం ఉంది. 17ఏ సెక్షన్ వర్తింపుపై పిటిషన్ మరో బెంచ్ ముందుకు వెళ్తున్నందున.. అప్పటివరకూ అరెస్ట్ వద్దని ఆదేశాలిస్తారా?.. లేక ముందస్తు బెయిల్ ఇస్తారా.. లేక మరేదైనా ఆదేశాలు వస్తాయా అన్నది ఉత్కంఠగా మారింది.

ఫైబర్ నెట్ కేసులో సుప్రీం ఇవ్వబోయే తీర్పు కూడా ఉత్కంఠ పెంచుతోంది. ఈ కేసు తప్ప మిగిలిన కేసుల్లో ఇప్పటికీ బెయిల్ వచ్చినందు వల్ల ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు చంద్రబాబు తన రాజకీయ కార్యకలాపాలు కొనసాగించడానికి ఎలాంటి ఆటంకాలు ఉండవని టీడీపీ వర్గాలు భావిస్తున్నాయి. ఇటు ఎన్నికలకు చంద్రబాబు సిద్ధం అవుతున్నారు. అయితే స్కిల్ కేసులో క్వాష్ ను కోర్టు అనుమతించలేదు.

కేవలం 17ఏ పైన మాత్రమే భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఇదే టైంలో ఈ కేసుల తదుపరి విచారణకు సీఐడీకి ఎటువంటి ఇబ్బంది లేదని.. విచారణ కొనసాగించే అవకాశం ఉందని లీగల్ ఎక్స్ పర్ట్స్ చెబుతున్నారు. అటు స్కిల్ కేసుల్లో హైకోర్టు ఇచ్చిన బెయిల్ పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ సీఐడీ సుప్రీంను ఆశ్రయించింది.

దీనిపై ఇప్పటికే వాదనలు జరిగాయి. ఈ అంశంపై సుప్రీం తీర్పు ఇవ్వాల్సి ఉంది. దీంతో సుప్రీంలో 17ఏ అంశంపై తీసుకునే నిర్ణయం.. సీఐడీ అడుగులు.. తదుపరి విచారణ వంటి అంశాల్లో ఎలాంటి పరిణామాలు జరుగుతాయనేది ఎన్నికల వేళ ఆసక్తి కరంగా మారబోతోంది.

TAGS