Emergency Money : వైద్యం, విద్య, వివాహం, తదితర విషయాల్లో అత్యవసరంగా నగదు అవసరం పడినప్పుడు చేతిలో లేనప్పుడు ఏం చేయాలని చాలా మందికి తోచదు. ఆ సమయంలో వారికి గుర్తుకు వచ్చేది పర్సనల్ లోన్. అయితే మంచి క్రెడిట్ స్కోర్ ఉంటేనే తక్కువ వడ్డీకి వీలైనంత తొందరలో లోన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇదే కాకుండా ఆస్తులను పూచీకత్తు (మాటిగేజ్) పెట్టి కూడా రుణాలు పొందవచ్చు. అలాంటివి ఏమున్నాయ్? ఆ రుణాల వడ్డీ రేట్లు.. దీనికి సంబంధించి ఇతర వివరాలు చూద్దాం..
ఎఫ్‌డీలపై లోన్..
చాలా మంది తమ జీవితంలో ఏదో ఒక సమయంలో ఫిక్స్ డ్ డిపాజిట్ అకౌంట్ ఓపెన్ చేసే ఉంటారు. దీనిపై కూడా లోన్ తీసుకోవచ్చు. అత్యవసరంగా డబ్బు అవసరం పడితే బ్యాంకులో ఉన్న ఎఫ్‌డీని పూచికత్తుగా చూపించి 70 శాతం నుంచి 95 శాతం వరకు రుణం పొందచ్చు. దీనిపై బ్యాంకులు ఇచ్చే వడ్డీ రేటు కంటే 1 శాతం నుంచి 2 శాతం అదనపు వడ్డీని వసూలు చేస్తాయి.
ఉదాహరణకు.. బ్యాంకులు మన డబ్బుకు ఎఫ్ డీలో 7 శాతం వడ్డీ ఇస్తున్నారనుకోండి.. ఎఫ్ డీపై రుణం ఇస్తే దానికి 8 శాతం నుంచి 9 శాతం వరకు వడ్డీ తీసుకుంటుంది. ఈ లోన్ మార్కెట్‌లో అందుబాటులో ఉన్న తక్కువ వడ్డీ రుణాల్లో ఒకటి. పైగా అదనపు డాక్యుమెంటేషన్ లేకుండా వేగంగా వస్తుంది. దీనికి క్రెడిక్ స్కోర్ ను పరిగణలోకి తీసుకోరు. రుణం తీసుకున్నా డిపాజిట్‌పై వడ్డీ వస్తూనే ఉంటుంది. మైనర్ పేరుతో ఎఫ్‌డీ ఉంటే రుణం రాదు. లోన్ డిఫాల్ట్ అయితే ఎఫ్‌డీ మొత్తం తీసుకొని బ్యాంక్ ఖాతాను మూసివేస్తుంది.
పీపీఎఫ్‌పై రుణం
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్) ఇది ప్రభుత్వ మద్దతుగల పొదుపు పథకం.
దీనిపై వడ్డీ రేటు 7.10 శాతంగా ఉంటుంది. 15 ఏళ్ల దీర్ఘ కాలిక పొదుపు పథకమే అయినా మెచ్యూరిటీ సమయం కంటే ముందే కొంత వరకు రుణంగా తీసుకోవచ్చు. ఖాతా తెరిచిన 3 నుంచి 6 సంవత్సరాల మధ్య రుణం పొందేందుకు అర్హులు. ఇందులో ఉన్న మొత్తంపై 25 శాతం వరకు గరిష్ఠంగా రుణం తీసుకోవచ్చు. ప్రభుత్వం ఇచ్చే వడ్డీ రేటు కంటే 1 శాతం అదనంగా వసూలు చేస్తారు. రుణం కాలవ్యవధి 3 ఏళ్లు ఉంటుంది.
గోల్డ్ పై లోన్..
ప్రస్తుతం ప్రతీ బ్యాంకులు గోల్డ్ పై రుణాలు ఇచ్చేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి. బ్యాంకుల వద్ద మన బంగారం ఉంటుంది కాబట్టి సెక్యూర్డ్ లోన్ గానే భావిస్తారు. ఈ రుణం కూడా వేగంగా వస్తుంది. వడ్డీ రేటు తక్కువగా ఉంటుంది. చాలా బ్యాంకులు 8 నుంచి 9 శాతం వడ్డీని వసూలు చేస్తున్నాయి. బంగారం విలువపై 50 నుంచి 70 శాతం వరకు రుణం లభిస్తుంది. తాకట్టు విలువను బట్టి రూ.20 వేల నుంచి రూ.1.50 కోట్ల వరకు రుణం పొందేందుకు అవకాశం ఉంటుంది. దీనికి కూడా క్రెడిట్ స్కోర్ తో సంబంధం లేదు. ఆయా భ్యాంకుల నిబంధనలు పట్టి కట్టాలి. తీసుకున్న రుణం కట్టకుంటే బంగారాన్ని వేలం వేస్తారు.
కారుపై లోన్
కొన్ని బ్యాంకులు మన వెహికిల్స్ హామీగా పెట్టుకొని కూడా లోన్ ఇస్తున్నాయి. మీ కారు న్యూ మోడల్, మంచి రీసేల్ వ్యాల్యూ ఉంటే మెరుగైన రుణం లభించే అవకాశం ఉంది. మరీ పాత మోడల్ వాటికి లోన్ వచ్చే అవకాశం లేదు. దీని కోసం క్రెడిట్ ప్రొఫైల్ ను పరిశీలిస్తారు. కారు విలువపై 50 శాతం నుంచి 150 శాతం వరకు రుణం పొందొచ్చు. వడ్డీ రేటు 11 శాతం నుంచి 23 శాతం వరకు ఉంటుంది. అదనంగా ప్రాసెసింగ్ ఫీజు ఉంటుంది. ఇది బ్యాంకును బట్టి మారుతుంది.
ఎల్ఐసీపై రుణం
ఎల్ఐసీ అనేది చాలా మందికి తెలిసే ఉంటుంది. పాలసీ ఉంటే రుణం తీసుకోవచ్చు. వారు కట్టే పాలసీని పూచికత్తుగా పెట్టుకొని సరెండర్ విలువపై 85 శాతం నుంచి 90 శాతం వరకు రుణం ఇస్తాయి. బ్యాంకులు కూడా పాలసీని తాకట్టు పెట్టుకొని రుణం ఇస్తాయి. కానీ, దీనికి ప్రాసెసింగ్ టైం ఎక్కువ. బీమా సంస్థలో మాత్రం ప్రాసెస్ వేగంగా అవుతుంది. రుణం చెల్లింపుల్లో డిఫాల్టయినప్పుడు.. రుణం, వడ్డీ కలిపి పాలసీ విలువకు మించి ఉంటే.. రద్దు కావచ్చు.
స్థిరాస్తిపై లోన్..
స్థిరాస్తులపై కూడా లోన్ తీసుకోవచ్చు. ఇది చాలా కాలంగా ఉన్నదే. సాధారణంగా ప్రైవేట్ వ్యక్తుల నుంచి రుణం తీసుకునేప్పుడు స్థిరాస్తిని తాకట్టు పెడతారు. వారి వద్ద వడ్డీ ఎక్కువగా ఉంటుంది. కానీ, బ్యాంకుల వద్ద ఆస్తి పత్రాలు తాకట్టు పెట్టి రుణం పొందవచ్చు. వీటిపై బ్యాంకులు 9.50 శాతం నుంచి వడ్డీ వసూలు చేస్తాయి. వడ్డీ రేటు బ్యాంకును బట్టి మారుతుంది. ఆస్తి విలువపై 50 శాతం నుంచి 60 శాతం వరకు రుణం పొందొచ్చు.
దీనికి కూడా క్రెడిట్ హిస్టరీతో సంబంధం లేదు. లీగల్ వెరిఫికేషన్, డాక్యుమెంటేషన్ ఎక్కువగా ఉంటుంది. లోన్ ప్రాసెస్ ఇంటి రుణంతో పోలి ఉంటుంది. ఆస్తి ఉండే ప్రదేశం, దాని భౌతిక స్థితిని బట్టి రుణం ఇవ్వాలా? వద్దా? అని బ్యాంకులు నిర్ణయించుకుంటాయి. రుణ గ్రహీతలు రుణాన్ని తిరిగి చెల్లించేప్పుడు డిఫాల్టవ్వకుండా చూసుకోవాలి. ఒకవేళ ఇలా జరిగితే బ్యాంకులు ఆస్తిని వేలం వేసే అవకాశముంది. ముందస్తు చెల్లింపులు జరిపితే బ్యాంకులు ఛార్జీలు విధిస్తాయి.
మ్యూచువల్ ఫండ్లు, షేర్లపై లోన్..
మ్యూచువల్ ఫండ్లు, స్టాక్స్‌ను తాకట్టు పెట్టుకొని బ్యాంకులు లోన్లు మంజూరు చేస్తాయి. బ్యాంకులు వీటి విలువపై 50 శాతం వరకు ఇస్తాయి. రుణం తిరిగి చెల్లించే సమయంలో ఈ ఫండ్లు/ స్టాక్స్‌పై వచ్చే డివిడెండ్ పొందుతూ ఉండొచ్చు. అయితే, షేర్ల ధరల్లో, మ్యూచువల్ ఫండ్ల ఎన్‌ఏవీలో తగ్గుదల ఉంటే బ్యాంకు కొన్ని షేర్లను, మ్యూచువల్ ఫండ్ యూనిట్లను విక్రయించవచ్చు లేదంటే అదనపు షేర్లు లేదా పెట్టుబడులను డిమాండ్ చేసే అవకాశం ఉంది.