KCR : ఏం సాధించావ్ కేసీఆర్.. మనతో ఉండేవారు ఎవరో అర్థమవుతోందా?
KCR : టీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ సెంటిమెంట్ మీద. తెలంగాణ ఇంటిపార్టీ, తెలంగాణ ప్రజల పార్టీ అది. ఉద్యమకాలంలో ప్రతీ తెలంగాణ వాది టీఆర్ఎస్ ను సొంత పార్టీ అనుకున్నారు. కేసీఆర్ ను తెలంగాణ గాంధీ అనుకున్నారు. పార్టీ స్థాపించిన 2001 నుంచి మొన్నటి అసెంబ్లీ ఎన్నికల వరకూ టీఆర్ఎస్ ఆలియాస్ బీఆర్ఎస్ ప్రస్థానం వైభవంగా సాగింది. మొన్నటి ఎన్నికల్లో ఓటమి పాలు కావడంతో ఎన్నడూ లేని గడ్డు పరిస్థితిని గులాబీ పార్టీ ఎదుర్కొంటోంది.
తెలంగాణ అంటే కేసీఆర్..కేసీఆర్ అంటే తెలంగాణ..ఇలా నడిచింది గత 23 ఏండ్లు. తెలంగాణలో కేసీఆర్ ఒక ప్రబలశక్తి, కేసీఆర్ అపర చాణక్యుడు, ఆయన వ్యూహం పన్నారు అంటే అది జరిగిపోవాల్సిందే. ఉద్యమ కాలంలో కేసీఆర్ అంటే ఒక నమ్మకం. ఏదో ఒకటి చేసి తెలంగాణ సాధిస్తాడని. అదే విశ్వాసంతో అప్పటి పాలకులు టీఆర్ఎస్ ను భూస్థాపితం చేయాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రజల అండతో కేసీఆర్ వాటిని ఎదుర్కొగలిగాడు.
తెలంగాణ ఉద్యమం ముగిసింది. తెలంగాణ వచ్చింది. తెలంగాణ గోస తెలిసిన వ్యక్తిగా ఉద్యమ నేతకే జనం పట్టం కట్టారు. కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో మంచి పనులు చేశారు అనడంలో సందేహం లేదు. తెలంగాణ వ్యవసాయం సహ ఎన్నో రంగాల్లో దేశంలోనే అగ్రరాష్ట్రంగా ఉందంటే కేసీఆర్ ప్రభుత్వం చేసిన పనులే. ఇటు తెలంగాణ అభివృద్ధితో పాటు పార్టీని బలోపేతం చేసుకోవడానికి కేసీఆర్ వివిధ పార్టీల్లో ఉన్న తెలంగాణ ద్రోహులను ఎందరినో చేర్చుకున్నారు. వారికి మంత్రి పదువులను ఇచ్చారు. వారు అవకాశవాదులైనప్పటికీ వారిని అందలం ఎక్కించి ఉద్యమ కాలం నుంచి టీఆర్ఎస్ అంటే ప్రాణం ఇచ్చే వారిని కార్యకర్తలుగానే మిగిల్చారు.
ఇతర పార్టీల నేతలను చేర్చుకోవడమే పనిగా పెట్టుకుని సొంత నాయకత్వాన్ని కేసీఆర్ మరిచారు. ఫస్ట్ టర్మ్ లో కేసీఆర్ పాలనపై ప్రజల్లో పెద్దగా వ్యతిరేకత లేదు. ఇక రెండో టర్మ్ గెలిచిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వచ్చింది. జనాల సమస్యలను పట్టించుకోలేదు..నిరుద్యోగులకు ఉద్యోగాలు వేయలేదు..ఉద్యోగుల కోరికలు తీర్చలేదు..పేదవాళ్లకు రేషన్ కార్డులు ఇవ్వలేదు..ఇలా ఎన్నెన్నో సమస్యలు..అయినా పట్టించుకోలేదు..ఎన్నికల వేళ మందు, పైసలు పంచితే చచ్చుకుంటూ తమకే ఓటేస్తారనే అహంకారం పోకడలో కేసీఆర్ ఉన్నారు.
రాజకీయాలే కాదు.. ప్రజలు, నాయకులు ఎంతో మారిపోయారు ఇప్పుడు. రాజకీయ నాయకులు ఎక్కడ అధికారం ఉంటే అక్కడికే వెళ్తున్నారు. విలువలు గట్రా ఏమి లేవు. పదేళ్లు అధికారం అనుభవించి కూడా మరో ఐదేళ్లు అధికారంలో ఉండొచ్చని అధికార పార్టీలోకి వెళ్తున్నారంటే వీళ్ల అవకాశవాదం ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇవన్నీ కేసీఆర్ కు తెలియనివి కావు. అయినా అహంకార పూరితంగా ప్రజలను దూరం చేసుకున్నారు. ముఖ్యంగా టీఆర్ఎస్ అంటే ప్రాణమిచ్చిన యువతను అస్సలు పట్టించుకోలేదు. ఉద్యమ కాలంలో పార్టీ వెన్నంటి ఉన్న ఉద్యోగులను గొర్రెల్లా చూశారు. ప్రజాసంఘాలను పక్కన పెట్టేశారు. ఇలా కర్ణుడి చావుకు కారణాలు అనేకం అన్నట్టుగా కేసీఆర్ రాజకీయ పతనానికి ఎన్నో కారణాలు.
ఇప్పటికైనా ఫార్మ్ హౌస్ వీడి జనంలోకి రావాలి. ప్రతిపక్ష పాత్రను సక్రమంగా పోషించాలి. ఇప్పటికీ మోసపోతున్న నిరుద్యోగులు, ఉద్యోగులకు అండగా నిలువాలి. నెర్రెలు బారుతున్న పొలాల్లో రైతుల కంటనీరు తుడవాలి. ఇంకా అహంకారం వదులుకోకపోతే రాజకీయ రణక్షేత్రంలో బీఆర్ఎస్ కోలుకోవడం కష్టం. మునపటి ఉద్యమ పార్టీలాగా ప్రజాక్షేత్రంలో గళమెత్తాలి. అవకాశవాదులు వెళ్లనివ్వండి..పార్టీ పునాది నేతలను గుర్తించి వారితోనే పోరాటం మళ్లీ మొదలుపెట్టండి. ప్రజలను గొర్రెల చూడకుండా విజ్ఞత గల పౌరులుగా గుర్తిస్తే వారే మీ వెంట ఉంటారు. ఎన్నికలప్పుడే ప్రజల్లోకి వస్తామంటే మీ పార్టీకి నూకలు చెల్లడం మాత్రం ఖాయం.