JAISW News Telugu

Paytm : అసలు పేటీఎంకు ఏమైంది! మన డబ్బులు సేఫేనా?

Paytm

RBI and Paytm

Paytm : గత కొన్ని రోజులుగా ఇటు సోషల్ మీడియాతో పాటు మేయిన్ స్ట్రీమ్ మీడియాలో పే-టీఎంపై వివాదాలు చుట్టు ముడుతున్నాయి. దీంతో వినియోగదారులు ఆందోళనకు గురవుతున్నారు. అసలు పే-టీఎంకు ఏమైంది. మన ఖాతా, డబ్బులు సేఫేనా? తెలుసుకుందాం.

వినియోగదారుల నుంచి డిపాజిట్లు స్వీకరించకుండా పే-టీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌ లిమిటెడ్‌ (PPBL)పై రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) ఆంక్షలు విధించింది. ‘పే-టీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌ 2024, ఫిబ్రవరి 29 తరవాత డిపాజిట్లను స్వీకరించవద్దు. ఖాతాలు, ప్రీ పెయిడ్‌ ఇన్‌స్ట్రుమెంట్లు, ఫాస్ట్‌ట్యాగ్‌లు, వాలెట్‌లు, నేషనల్‌ కామన్‌ మొబిలిటీ (ఎన్‌సీఎంసీ) కార్డులు తదితరాల్లో క్రెడిట్‌ లావాదేవీలు టాప్‌అప్‌లు చేయకూడదు’ అని ఆర్‌బీఐ ఆదేశించింది. PPBL కార్యకలాపాలపై ఆడిటర్లు ఆడిట్‌ చేసి ఇచ్చిన నివేదిక ఆధారంగానే ఆర్‌బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. సంస్థ నిబంధనలు ఉల్లంఘించిందని, పర్యవేక్షణ లోపాలున్నాయని ఆడిట్‌లో తేలినందునే చర్యలు తీసుకుంటున్నామని ఆర్‌బీఐ స్పష్టం చేసింది.

ఇప్పటి దాకా 70 శాతం పతనం..
PPBLపై RBI ఆంక్షల నేపథ్యంలో దాని మాతృ సంస్థ వన్‌97 కమ్యూనికేషన్స్‌ (Pay-tm) షేరు రెండు ట్రేడింగ్‌ రోజుల్లో (గురు, శుక్రవారం) 40 శాతం క్షీణించింది. శుక్రవారం 20 శాతం నష్టంతో రూ.487.05 వద్ద స్థిరపడింది. కంపెనీ మార్కెట్‌ విలువ రెండు రోజుల్లో రూ.17,378.41 కోట్లు కోల్పోయి రూ.30,931.59 కోట్లకు పరిమితమైంది. 2021లో రూ. 1 విలువ కలిగిన షేరుకు రూ.2,150 ఇష్యూ ధరతో పే-టీఎం పబ్లిక్‌ ఇష్యూకు తెచ్చింది. దీని ద్వారా రూ.18,300 కోట్లను సమీకరించింది. ఇందులో రూ.8,300 కోట్లను తాజా షేర్ల జారీ ద్వారా, రూ.10 వేల కోట్లను ఆఫర్‌ ఫర్‌ సేల్‌ (ఓఎఫ్‌ఎస్‌) పద్ధతిలో సేకరించుకుంది. నవంబరు 18వ తేదీ ఎన్‌ఎస్‌ఈలో రూ. 1,950 వద్ద, బీఎస్‌ఈలో రూ.1,955 వద్ద నమోదైంది. అదే రోజు రూ.1,560 కనిష్ఠంగా నమోదు చేసింది. ఇప్పటి వరకు షేరు 77 శాతం నష్టపోవడం గమనార్హం.

ప్రారంభంలోనూ..
పే-టీఎం 2009లో విజయ్‌ శేఖర్‌ శర్మ ప్రారంభించారు. ఆదిలోనే అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ సంస్థను నడిపారు. అలీబాబా గ్రూప్‌నకు చెందిన జాక్‌మా, సాఫ్ట్‌ బ్యాంక్‌ నుంచి పెట్టుబడులు తీసుకువచ్చి వార్తల్లోకి ఎక్కారు. 2016లో ప్రధాని మోదీ పెద్ద నోట్లను రద్దు చేయడంతో పే-టీఎంకు కలిసొచ్చింది. ఎక్కువ మంది డిజిటల్‌ చెల్లింపులకు మారి, పేటీఎంను వినియోగించారు. దేశంలోని 100 మంది ధనికుల క్లబ్‌లో విజయ్‌ కూడా చేరారు. గూగుల్‌ వంటి బడా కంపెనీలు చిన్న అంకుర సంస్థలను దెబ్బ తీసేలా కార్యకలాపాలు సాగిస్తున్నాయని విమర్శించడం అప్పట్లో చర్చనీయాంశమైంది. పే-టీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌లో విజయ్‌కి 51 శాతం వాటా ఉండగా, మిగతా ఒన్‌97 కమ్యూనికేషన్స్‌ లిమిటెడ్ కు చెందినది.

ప్రస్తుత ఆర్‌బీఐ ఆంక్షల నేపథ్యంలో విజయ్‌ ‘ఎక్స్‌’లో స్పందించారు. ‘ప్రతి సవాలుకు పరిష్కారం ఉంటుంది. దేశానికి సేవ చేసేందుకు విధేయత కలిగి ఉంటాం’ అని పోస్ట్‌ చేశారు.

ఆరోపణలు..
పే-టీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌పై RBI ఆంక్షలకు సంబంధించి కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. మనీ లాండరింగ్‌ ఆరోపణలు, కేవైసీ ఉల్లంఘనలు నేపథ్యమని తెలుస్తోంది. పే-టీఎం వ్యాలెట్‌, పేమెంట్స్‌ బ్యాంక్‌ మధ్య కోట్లాది రూపాయల మోసపూరిత లావాదేవీలు జరిగాయి. అవసరం అనుకుంటే ఈ వ్యవహారంలో ఈడీ రంగంలోకి దిగే అవకాశమూ లేకపోలేదు.

పే-టీఎం బ్యాంక్‌కు సంబంధించి కేవైసీ చేయని లక్షలాది ఖాతాలను గుర్తించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఒకే పాన్‌తో వేలాది మంది ఖాతాలు తెరిచినట్లు కూడా కనిపించింది. కేవైసీ ఖాతాలకు గరిష్ఠ పరిమితిని మించి కొన్ని సార్లు ఆయా ఖాతాల్లో లావాదేవీలు జరిగినట్లు వెల్లడైంది. పే-టీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌కు రూ. 35 కోట్ల ఈ-వాలెట్లు ఉండగా, 31 కోట్ల ఖాతాలు స్లీప్ మోడ్, ఇక, మిగిలిన 4 కోట్ల ఖాతాలు జీరో బ్యాలెన్స్‌ లేదా స్వల్ప మొత్తాలను కలిగి ఉన్నాయి. స్లీప్ మోడ్ లోని ఖాతాలను  మనీలాండరింగ్‌ కోసం వినియోగించే అవకాశం ఉందని అనుమాన్యం వ్యక్తం అవుతుంది.

ప్రతీ సంస్థను నియంత్రించేందుకు ఆయా రంగంలో నియంత్రణ సంస్థ ఉంటుంది. ఆర్థిక రంగంలోని పే-టీఎం నిబంధనలు ఉల్లంఘించారని ఆర్‌బీఐ చర్యలకు పూనుకోవడం సబబే. ఫిన్‌టెక్‌ కంపెనీగా కొనసాగుతున్న PPBL నియంత్రణ సంస్థ పర్యవేక్షణ నుంచి తప్పించుకోలేదు.

మార్చి 1వ తేదీ నుంచి అన్ని కార్యకలాపాలను నిలిపేయాలని పే-టీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌కు ఆర్‌బీఐ ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో పే-టీఎం వినియోగదారులు సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నాం. ఒకవేళ పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌ లైసెన్స్‌ ఆర్‌బీఐ రద్దు చేస్తే, పే-టీఎంను కాపాడే ప్రణాళిక లేదు.

Exit mobile version