Mayank Agarwal : టీమిండియా క్రికెటర్, కర్ణాటక రంజీ టీమ్ కెప్టెన్ మయాంక్ అగర్వాల్ ఫ్లైట్ లో నీళ్లు అనుకుని విష పదార్థం తాగి అస్వస్థతకు గురయ్యాడు. అగర్తలాలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటన దేశాన్ని షాక్ కు గురిచేసింది. అగర్తలాలో త్రిపుర, కర్ణాటక మధ్య రంజీ మ్యాచ్ ముగిసిన అనంతరం మయాంక్ ఢిల్లీ మీదుగా సూరత్ కు బయలుదేరాడు. తన సీటు ముందున్న ఓ పౌచ్ ను వాటర్ గా భావించి తాగాడు. దీంతో నోరు, గొంతులో తీవ్రమైన మంటతో ఇబ్బంది పడ్డాడు.
రెండు సార్లు వాంతి చేసుకున్నాడు. దీంతో మాట కూడా పడిపోయింది. వెంటనే అతడిని ఎయిర్ పోర్టు నుంచి నేరుగా అగర్తలా లోని ఐఎల్ ఎస్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ మేరకు ఆస్పత్రి హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. ఇప్పుడు మయాంక్ కోలుకుంటున్నాడని తెలిపింది. అతడు త్వరలో కోలుకునేలా మెరుగైన చికిత్స అందిస్తున్నామని ఆస్పత్రి వర్గాలు చెబుతున్నాయి.
మయాంక్ అస్వస్థతకు గురైన సందర్భంలో అతడిపై కుట్ర కోణం జరిగిందా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఇండిగో విమాన సంస్థ కూడా దర్యాప్తు చేస్తోంది. మయాంక్ సీటుపై ఆ పౌచ్ ఎందుకు ఉంచారు? ఎవరు ఉంచారు? అనే విషయంపై నిజాలు వెల్లడించాలని పట్టుపడుతున్నారు. సంఘటనపై స్పష్టత రావాల్సి ఉందని అంటున్నారు.
అందులో ఏ రసాయనం ఉంది. అది ఎవరు తీసుకొచ్చారు. అక్కడ ఎందుకు వదిలారు. అనే విషయాలపై ఆరా తీస్తున్నారు. కుట్ర చేశారా? అనుకోకుండా జరిగిందా? అని విచారణ చేస్తున్నారు. దీనిపై సమగ్ర దర్యాప్తు జరిగితే నిజానిజాలు వెలుగు చూసే అవకాశం ఉందంటున్నారు. దీంతో ఈ ఘటనపై లోతుగా అధ్యయనం చేస్తున్నారు.