Kaleshwaram : సీఎం రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వివిధ పథకాలు, సంక్షేమ కార్యక్రమాల అమలుపై దృష్టి సారించారు. అలాగే గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అవినీతి, అక్రమాలపై కూడా ఓ కన్ను వేశారు. బీఆర్ఎస్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవకతవకలు, బ్యారేజీ నిర్మాణలోపాలు, దానిలో అవినీతి ఇలా..అన్ని కోణాల్లో ఈ ప్రాజెక్టుపై ప్రత్యేకంగా అధ్యయనం చేయిస్తున్నారు. కాళేశ్వరం అవినీతిపై ఏదో లెక్క తేలితే కేసీఆర్ ను దోషిగా చేయాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నారు.
కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డిని నోటుకు వోటు కేసులో జైలులో పెట్టించడం, కొడంగల్ పట్టుపట్టి ఓడించడం..లాంటివి రేవంత్ రెడ్డి మరిచిపోయినట్టు లేరు. అందుకే కేసీఆర్ ఏ కేసులో దొరుకుతారా? అన్నట్టు చూస్తున్నారు. అందుకే బీఆర్ఎస్ చేపట్టిన అన్ని ప్రాజెక్టులు, పథకాల్లో అవినీతిపై విచారణ చేయించే పనిలో పడ్డారు. అన్నింటికంటే ప్రధానంగా కాళేశ్వరంలో జరిగిన అవినీతిపై ఆయన దృష్టిసారించారు.
అందుకే కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ కమిటీ వేశారు. వారితోనూ, ఇంజినీరింగ్ ముఖ్య అధికారులతోనే రేవంత్ పలు దఫాలుగా సమీక్షలు చేశారు. అయితే వారు ఏ తప్పు జరుగలేదని, రెగ్యులర్ జరిగే వైఫల్యాలే అన్నట్టుగా సమాధానం చెప్పుకుంటూ వస్తున్నారు. ఇటీవల సీఎం రేవంత్.. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎస్ శాంతికుమారి, ఇంజినీర్ ఇన్ చీఫ్ లు, ప్రాజెక్టుల చీఫ్ ఇంజినీర్లు, కాళేశ్వరంపై దర్యాప్తు చేస్తున్న విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టర్ జనరల్ రాజీవ్ రతన్, నిఘా విభాగం అధిపతి శివధర్ రెడ్డిలతో సమీక్ష నిర్వహించారు.
వారు చెప్పిన సమాధానాలతో ఏకీభవించని సీఎం రేవంత్ రెడ్డి..కాళేశ్వరం ప్రాజెక్టుపై పూర్తిస్థాయిలో నివేదిక ఇవ్వాలని, అందులో అధికారులు, కాంట్రాక్టర్, గత ప్రభుత్వ పాత్రకు సంబంధించిన పూర్తి నిజాలను బయటపెట్టాలని ఆదేశించారు. కాళేశ్వరం బ్యారేజీలకు సంబంధించి వాస్తవం ఏమిటో చెప్పండి.. సగం సగం చెప్పి చీకట్లో పెట్టే ప్రయత్నం చేయవద్దన్నారు. సీడబ్ల్యూసీ, డ్యాం సేఫ్టీ అధికారులతో కమిటీ ఏర్పాటు చేసి మూడు బ్యారేజీల పరిస్థితి ఏమిటో, ఏం చేయాలో తేల్చి.. ఆ ప్రకారం చేద్దామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించినట్లు తెలుస్తోంది. బ్యారేజీల భద్రతపై ఢోకా లేదని ధ్రువీకరించిన తర్వాతనే దెబ్బతిన్న చోట్ల పనులు చేపట్టాలని సూచించారు.
దీన్ని బట్టి కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతిపై నిజాలు బయటకు వస్తే మాజీ సీఎం కేసీఆర్ పై రివేంజ్ తీసుకునే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.