Sharmila : ఇంతకీ చంద్రబాబుతో షర్మిల ఏం మాట్లాడిందబ్బా?

Sharmila

Sharmila and Chandrababu

Sharmila Talk : కాంగ్రెస్ నాయకురాలు వైఎస్ షర్మిల శనివారం హైదరాబాద్ లో టీటీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇంటికి వెళ్లి తన కొడుకు రాజారెడ్డి నిశ్చితార్థంతో పాటు వచ్చే నెలలో జరిగే వివాహానికి రావాల్సిందిగా ఆహ్వానించారు. అనంతరం షర్మిల మీడియాతో మాట్లాడుతూ.. పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డితో తొలి దశలో తమ స్నేహం గురించి చంద్రబాబు తనకు చెప్పారన్నారు.

ఇద్దరూ కలిసి కాంగ్రెస్ పార్టీలో ఎలా తిరిగారో, అప్పటి సీఎం కోసం ఎలా కలిసి పనిచేశారో తెలిపారన్నారు. ఇద్దరూ కలిసే ఒకే జీపులో తిరగామని, వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఎలాంటి మనిషో.. అని చాలా సేపు చంద్రబాబు తనతో చెప్పారన్నారు. గత సంఘటనలన్నీ గుర్తుచేసుకున్నారన్నారు. ఇది తనకు ఎంతో సంతోషాన్ని కలిగించిందని షర్మిల అన్నారు.

చంద్రబాబును తన కుమారుడి పెళ్లికి పిలవడాన్ని రాజకీయ కోణంలో చూడవద్దని షర్మిల కోరారు. ఇదేమీ వింత , విచిత్రం కాదని కూడా  చెప్పారు. గతంలో నాన్న రాజశేఖర్ రెడ్డి కూడా తమ పెళ్లిళ్లకు చంద్రబాబును ఆహ్వానించారన్నారు. ఆయన వచ్చి తమను ఆశీర్వదించారని కూడా తెలిపారు.

 చంద్రబాబుతో ఎలాంటి రాజకీయ లావాదేవీలు ఉండవని షర్మిల తేల్చిచెప్పారు. ఫ్రెండ్లీ రాజకీయాలు ఉండాలని ఆమె కోరారు. తాను క్రిస్మస్ సందర్భంగా ఒక్క చంద్రబాబు కుటుంబానికే కాదు.. హరీశ్ రావు, కేటీఆర్, కవిత కుటుంబాలకు కూడా కేక్ పంపించాన్నారు. రాజకీయాల్లో భాగంగా ప్రత్యర్థులం కాబట్టి ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటామని చెప్పారు. కేకులు పంపడం లాంటివి వ్యక్తిగత స్నేహానికి సంకేతమని షర్మిల చెప్పారు. కాగా, ఏపీ రాజకీయాలపై తామేం చర్చించలేదని షర్మిల చెబుతున్నా మీడియాలో వారు ఏం చర్చించి ఉంటారనే దానిపైనే వార్తలు చక్కర్లు కొట్టడం గమనార్హం.

TAGS