Pawan Kalyan : పవన్ సాధించింది ఏంటీ?
Pawan Kalyan : వైసీపీ అధినేత, సీఎం జగన్ ను గద్దె దించడమే లక్ష్యంగా జనసేనాని పవన్ కల్యాణ్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఒంటరిగా పోటీ చేస్తే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి అంతిమంగా వైసీపీకే ప్రయోజనమని చెప్పి టీడీపీతో పొత్తు పెట్టుకున్నారు. ఈ కూటమిలోకి బీజేపీని తీసుకురావడానికి బాగానే కష్టపడ్డారు. చివరకు సీట్ల లెక్కకు వచ్చేసరికి అందరి కంటే ఎక్కువ నష్టం జనసేనకే జరిగిందని చెప్పక తప్పదు.
పొత్తులో భాగంగా జనసేనకు 21 అసెంబ్లీ, 2 లోక్ సభ, బీజేపీకి 10 అసెంబ్లీ, 6 ఎంపీ, టీడీపీకి 144 అసెంబ్లీ, 17ఎంపీ సీట్లు దక్కాయి. ఈ వార్త బయటకు వచ్చినప్పటి నుంచి జనసైనికులు, కాపు సామాజిక వర్గనేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జనసేనాని పవన్ సీఎం కావడం తమ లక్ష్యమని, కానీ ఆయన పొత్తులో 21 సీట్లకు ఎలా ఒప్పుకుంటారని అంటున్నారు. ఈ 21 సీట్లతో పవన్ సీఎం కావాలంటే కల్ల అని ఆవేదన చెందున్నారు.
జనసేన, బీజేపీ కలిసి పోటీ చేసినా ఈ స్థానాలను ఈజీగా గెలిచేవారని వారు అంటున్నారు. దీనికి పొత్తు అవసరమా అని ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రంలోని మొత్తం 175 సీట్లలో జనసేన, బీజేపీ కలిసి పోటీ చేసి కష్టపడితే కచ్చితంగా 50-60 సీట్లు వచ్చేవని అంటున్నారు. అలాగే టీడీపీ కూడా 50-60 సీట్లు, వైసీపీ 70-80 సీట్ల దాక వచ్చేవని, అప్పుడు టీడీపీతో పొత్తు పెట్టుకుని సీఎం పదవిని చెరో రెండున్నర సంవత్సరాలు చేసుకుంటే సరిపోయేదని చెబుతున్నారు. ఇలా చేస్తే పవన్ సీఎం కల కూడా తీరేదని అంటున్నారు. దీంతో పాటు ఓడిన స్థానాల్లో కనీసం పార్టీ క్యాడర్ ఎంతో కొంత తయారయ్యేదని, 2029 ఎన్నికల నాటికి జనసేన పెద్ద పార్టీకి అవతరించే చాన్స్ ఉండేదంటున్నారు.
ఇప్పుడు పవన్ 21 సీట్లకు ఒప్పుకోవడం ద్వారా పార్టీకి, పవన్ ఎదుగుదలకు ఏ మాత్రం ప్రయోజనం ఉండే అవకాశం లేదని జనసైనికులు ఆవేదన చెందుతున్నారు. ఈ పొత్తులు అంతిమంగా టీడీపీకే ప్రయోజనం చేకూరుతుందని అంటున్నారు. ఎన్నికలకు ముందే ఇలా జరిగితే ఒకవేళ అధికారంలోకి వచ్చినా జనసేనను బతికించుకోవడం కష్టమే అంటున్నారు. మొత్తానికి పొత్తుల వ్యవహారం జనసేనకు పెద్ద తలనొప్పిని తెచ్చిందని విశ్లేషకులు భావిస్తున్నారు.