Alla Ramakrishna : ఏపీ ఎన్నికల రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. ఎన్నికల వేళ వైసీపీ చేపట్టిన ఇన్ చార్జుల మార్పుల్లో టికెట్ కోల్పోయిన ఓ సీనియర్ ఎమ్మెల్యే, రాజధాని ప్రాంతంలోని కీలక నేత ఇప్పుడు సొంత గూటికి చేరేందుకు తహతహలాడుతున్నారు. వైసీపీలో టికెట్ రాకపోవడంతో విపక్ష పార్టీలోకి వెళ్లిన సదరు ఎమ్మెల్యేకు ఎన్నికలు దగ్గర పడుతున్న సొంత వాళ్ల ఒత్తిడి పెరిగిపోయి ఉక్కిరిబిక్కిరవుతున్నారు.
ఇన్నాళ్లూ తనను నమ్ముకుని ఉన్న వర్గం నేతలంతా పెంచుతున్న ఒత్తిడితో తిరిగి సొంత గూటికి చేరేందుకు ఆయన ప్రయత్నాలు చేసుకుంటున్నారు. ఇందులో భాగంగా ఇవాళ సీఎం జగన్ తో భేటీ కాబోతున్నారు.
వైసీపీ చేపట్టిన ఇన్ చార్జుల మార్పుల్లో రాష్ట్రంలో పదుల సంఖ్యలో ఎమ్మెల్యేలు ఈ సారి సీట్లు కోల్పోయారు. ఇందులో ఒకరైన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి..అధికార పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. పీసీసీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టిన షర్మిలతో, వైఎస్ కుటుంబంతో ఉన్న అనుబంధం కారణంగా చాలా సులువుగా వైసీపీని వీడి కాంగ్రెస్ బాట పట్టారు. అంతే కాదు కాంగ్రెస్ లో చేరిన తొలి వైసీపీ ఎమ్మెల్యేగా కూడా ఆయన గుర్తింపు తెచ్చుకున్నారు.
అయితే ఇంతవరకు బాగానే ఉన్నా..కాంగ్రెస్ లో చేరాక ఆయన కష్టాలు మొదలయ్యాయి. అప్పటివరకూ మంగళగిరి ఎమ్మెల్యేగా, అధికార పార్టీ నేతగా ఉన్న పలుకుబడి అంతా పోవడంతో పాటు సొంత నియోజకవర్గంలో ప్రోటోకాల్ దగ్గరి నుంచి అన్ని వదులుకోవాల్సిన పరిస్థితి. దీంతో రెండు సార్లు ఆయనతో పాటు ఉండి గెలిపించిన అనుచరులంతా ఆత్మరక్షణలో పడ్డారు. అంతే ఆళ్లపై ఒత్తిడి పెంచడం మొదలుపెట్టారు. దీని ఫలితం రెండు రోజుల కింద వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డితో ఆళ్ల చర్చలు జరిపారు.
ఈ చర్చల్లో తిరిగి వైసీపీలోకి వచ్చేందుకు ఆళ్ల సుముఖత వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. దీంతో ఇవాళ సీఎం జగన్ తో ఆళ్ల రామకృష్ణారెడ్డి భేటీ ఏర్పాటు చేయించినట్లు తెలుస్తోంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఇవాళ మధ్యాహ్నం 3గంటలు ఆర్కే..సీఎం జగన్ తో భేటీ కాబోతున్నారు. ఇప్పటికే ఆళ్ల స్థానంలో వైసీపీ ఎంచుకున్న బీసీ అభ్యర్థి గంజి చిరంజీవికి నియోజకవర్గంలో అంతగా ఆదరణ లభించకపోవడంతో తిరిగి ఇన్ చార్జి ను మార్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అదే సమయంలో ఆర్కే కూడా వైసీపీలోకి తిరిగి వస్తే జగన్ రిస్క్ ఎందుకని తిరిగి ఆయనకే టికెట్ ఇచ్చిన ఆశ్చర్యం లేదు.