Chandrababu : దేశంలో సార్వత్రిక ఎన్నికలు సజావుగా జరుగుతున్నాయి. నిన్ననే నాలుగో విడత ఎన్నికలు కూడా ముగిశాయి. ఐదో విడత ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి సారించింది. ఐదో విడతలో బిహార్, జమ్మూ కశ్మీర్, జార్ఖండ్, లఢక్, మహారాష్ట్ర, ఒడిశా, ఉత్తర ప్రదేశ్, పశ్చిమ బెంగాల్ లోని 49 లోక్ సభ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. ఇక ఏడో దశలో ప్రధాని మోదీ పోటీ చేసే వారణాసి స్థానానికి ఎన్నికలు ఉండనున్నాయి. ఇది చివరి విడత. ఇవ్వాళ్టీతో ఏడో విడత నామినేషన్లు ముగుస్తున్నాయి. ఏడో దశ ఎన్నికల పోలింగ్ జూన్ 1న జరుగుతుంది.
నేడు మోదీ తన నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. అంతకుముందు దశాశ్వమేథ ఘాట్ లో గంగానదికి ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. క్షేత్రపాలకుడు కాలభైరవుడు, కాశీ విశ్వనాథుడిని దర్శించుకున్నారు. అనంతరం మోదీ నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. వారణాసి నుంచి మోదీ పోటీ చేయడం మూడోసారి. 2014, 2019 ఎన్నికలలో ఇక్కడి నుంచి పోటీ చేసి గెలిచారు. ఇప్పుడు మూడో సారి హ్యాట్రిక్ కొట్టడం సునాయాసమే. 2014 ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున పోటీ చేసిన ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, 2019లో సమాజ్ వాదీ పార్టీ అభ్యర్థి షాలిని యాదవ్ ను మోదీ ఓడించారు.
నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనడానికి ఎన్డీఏ భాగస్వామ పక్షాలకు ఆహ్వానం అందించారు. అందులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేనాని పవన్ కల్యాణ్ కు ఆహ్వానం అందగా వారిద్దరూ వారణాసికి చేరుకున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ..నరేంద్రమోదీ నామినేషన్ కార్యక్రమాన్ని చారిత్రక ఘట్టంగా కొనియాడారు. అందులో తాము భాగస్వాములు కావడం అదృష్టమని చెప్పారు. కేంద్రంలో ఎన్డీఏ అధికారంలోకి రావడం ఖాయమని జోస్యం చెప్పారు. మోదీ మరోసారి ప్రధాని అవుతారని, ఈ దేశానికి దిశానిర్దేశం చేస్తారని తెలిపారు. ఏపీ ఎన్నికల్లో సైతం ఎన్డీఏ క్లీన్ స్వీప్ చేస్తుందన్నారు. ఆ ధీమా తనకు ఉందన్నారు. నూటికి నూరు శాతం క్లీన్ స్వీప్ చేయబోతున్నామని, 25 లోక్ సభ స్థానాలను తాము గెలుచుకోబోతున్నామని తేల్చిచెప్పారు.