New Ration Cards : కొత్త రేషన్ కార్డులేవి? సన్న బియ్యం ఎప్పుడు? ఎదురుచూపుల్లో పేదలు
New Ration Cards : తెలంగాణ పేదలకు రేషన్ కార్డులు, సన్నబియ్యం కల నెరవేరేటట్టులేదు. ఏండ్ల తరబడిగా ఎదురు చూస్తున్న కొత్త ప్రభుత్వంలోనూ రేషన్ కార్డులు అందకపోవడంతో నిరాశ చెందుతున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కొత్త రేషన్ కార్డుల ఊసే లేదు. తాము అధికారంలోకి వస్తే కొత్త రేషన్ కార్డులు ఇస్తామని చెప్పినా కాంగ్రెస్..గెలిచినా తర్వాత అదిగో..ఇదిగో అంటూ ఊరిస్తోంది. జనవరి తొలి వారంలోనే ప్రజాపాలనలో కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు తీసుకున్నా ఇప్పటివరకు ఇవ్వలేదు.
ఇటీవల కాలంలో తరుచుగా మంత్రులు, ఎమ్మెల్యేలు..అర్హులందరికీ కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తాం.. రేషన్ దుకాణాల ద్వారా సన్న బియ్యం సరఫరా చేస్తాం’’ అని ప్రకటిస్తుండడంతో పేద, మధ్యతరగతి వర్గాలు ఆశగా ఎదురుచూస్తున్నాయి. ప్రభుత్వ పథకాల్లో లబ్ధి పొందాలంటే రేషన్ కార్డు తప్పనిసరి. అయితే గత కొన్ని సంవత్సరాలుగా కొత్త కార్డులు జారీ చేయకపోవడంతో ఎంతో మంది అర్హులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుత ప్రభుత్వం అమలుచేస్తున్న ఆరు గ్యారెంటీలకు రేషన్ కార్డే ప్రతిపాదిక. దీంతో లక్షలాది మంది అర్హులుగా ఉండి కూడా సంక్షేమ పథకాలకు నోచుకోవడం లేదు.
ఇదిలా ఉండగా రేషన్ దుకాణాల ద్వారా సన్న బియ్యం పంపిణీ చేస్తామని ప్రభుత్వం ఇటీవల ప్రకటించడంతో లబ్ధిదారులు ఆశలు పెట్టుకున్నారు. ఓపెన్ మార్కెట్ లో సన్న బియ్యం ధరలు ఆకాశన్నంటుతున్నాయి. పేద, మధ్య తరగతి ప్రజలు కొనలేకపోతున్నారు. అయితే ప్రభుత్వ అందించే దొడ్డు బియ్యం ఒక కుటుంబానికి సరిపోవు. దీంతో మార్కెట్ లో బియ్యం కొనడం తప్పనిసరి. దొడ్డు బియ్యం మధ్యతరగతి వారు తినేటట్టు ఉండవు. దీంతో వీరు కూడా సన్న బియ్యం కొనక తప్పదు. తాము సంపాదించే దానిలో సగానికి పైగా బియ్యం కొనడానికే పెడుతున్నారు. ప్రభుత్వం చెప్పినట్టుగా రేషన్ ద్వారా సన్న బియ్యం అందిస్తే లక్షలాది మందికి లబ్ధి చేకూరుతుంది.