Thalapathy Vijay : ఇళయ దళపతి విజయ్ సీఎం అయ్యే ఛాన్స్ ఎంత?
Thalapathy Vijay : రాజకీయాన్ని, సినీరంగాన్ని వేరు చేసి చూడడం కొంచెం కష్టమనే చెప్పవచ్చు. సినిమా నటులు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడమే కాకుండా. సీఎంలుగా పాలించారు. ఆ జాబితాలోకి తమిళ స్టార్ హీరో, ఇళయ దళపతి విజయ్ చేరుతారన్న ప్రచారం జోరుగా జరుగుతోంది.
కోలివుడ్ సూపర్ స్టార్, ఇళయ దళపతి విజయ్ గురించి పరిచయం అవసరం లేదు. విజయ్ ఇటీవల కొత్త పార్టీ ‘తమిళగ వెట్రి కళగం’ ప్రకటించాడు. జెండా, ఎజెండా త్వరలో ప్రకటిస్తానంటూ చెప్పాడు. ‘తమిళనాడులో అవినీతి పాలన సాగుతోందని, అవినీతి నిర్మూలనే ధ్యేయమని, 2026 అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్ అంటూ విజయ్ అన్నారు. విజయ్ పొలిటికల్ ఎంట్రీపై ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఇక విజయ్ గురించి చెప్పుకుంటే సామాన్యమైన స్థాయి నుంచి ఇళయ దళపతిగా ఎదిగేందుకు ఎంతో శ్రమించాడు. ఒక రకంగా చెప్పాలంటే సూపర్ స్టార్ రజినీకాంత్ కు సమానంగా ఆయన ఫేమ్ కొనసాగుతోంది. డబ్బింగ్ మూవీస్ తో కెరీర్ ప్రారంభించిన విజయ్.. ఇండస్ట్రీలో నిలదొక్కుకునేందుకు బాగా కష్టపడ్డాడు.
ఇండస్ట్రీ పరంగా చెప్పాలంటే సౌత్ ఇండియాలో టాప్ హీరోగా గుర్తింపు సంపాదించుకున్నాడు. మిగిలిన హీరోలు దేశ వ్యాప్తంగా సాధించిన కలెక్షన్లను విజయ్ కేవలం తమిళనాడులోనే రాబడుతుండడం విశేషం. ప్రాంతీయ ఇండస్ట్రీ నుంచి రూ. 350 కోట్ల గ్రాస్ రాబట్టే సత్తా విజయ్ కి ఉందంటే అతిశయోక్తి కాదు. ఇక ఆయన రేంజ్ గురించి ఎంత చెప్పినా తక్కువనే చెప్పవచ్చు. ‘నాలియ తీర్పు’తో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.. తక్కువ కాలంలో స్టార్ డం సంపాదించుకున్నాడు. స్నేహితుడితో టాలీవుడ్ కు చాలా దగ్గరయ్యాడు. తెలుగు నాట కూడా విజయ్ కి మంచి ఫాలోయింగ్ ఉంది. తుపాకీ, కత్తి, జిల్లా, పులి, పోలీసోడు, బిగిల్, అదిరింది, మాస్టర్, బీట్స్ మూవీలతో టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద కూడా సత్తా చాటాడు.
విజయ్ కరెక్ట్ సమయంలోనే రాజకీయాల్లోకి వచ్చాడని, ప్రస్తుతం తమిళనాడులో అతనికి ఉన్న అవకాశాలను సరైన విధంగా వినియోగించుకుంటే సీఎం అయ్యే ఛాన్స్ లేకపోలేదని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. తమిళ నాట రాజకీయాలను సినీ నటులే శాసించడం పరిపాటి. అన్నా డీఎంను స్థాపించిన ఎంజీఆర్ సీఎం అయ్యారు. ఆయన తరువాత కరుణానిధి, జయలలిత ఇలా అందరూ సినీ ఇండస్ట్రీకి చెందిన వారే సీఎంలుగా ఏలారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఎంజీఆర్ ను చూసే తెలుగు నాట నందమూరి తారక రామారావు పార్టీని పెట్టారు. ఈవిషయాన్ని కూడా ఆయన స్వయంగా ప్రకటించారు కూడా.
ప్రధాన ప్రతిపక్షంలో చీలికలు, అసంతృప్తులతో గందరగోళంగా ఉంది. ఇలాంటి తరుణంలో విజయ్ రావడం.. మంచి అవకాశమనే టాక్ వినిపిస్తోంది. మరింత కష్టపడితే 2026 ఎన్నికల్లో విజయ్ సీఎం అయ్యే ఛాన్స్ కనిపిస్తుంది. ఇలాంటి అవకాశమే చాలా ఏళ్ల క్రితం రజినీకాంత్ కు వచ్చింది. ఆ సమయంలో ఆయన రాజకీయాల వైపు చూడలేదు. రీసెంట్ గా అలాంటి అవకాశం ఇళయ దళపతికి వచ్చింది. దీన్ని ఆయన ఎలా వినియోగించుకుంటారో వేచి చూడాలి.