Exit Polls : ఎగ్జిట్ పోల్స్ అంటే ఏమిటి? వాటిలో ప్రామాణికత ఎంత?
Exit Polls : దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు నేటితో పూర్తికానున్నాయి. నేడు 2024 లోక్‌సభ ఎన్నికల చివరి దశలో.. 7 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలోని 57 స్థానాలకు ఓటింగ్ జరుగనుంది. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు నేటి సాయంత్రం వరకు ఎగ్జిట్ ఫలితాల పైన నిషేధం ఉంది. ఈ రోజు పోలింగ్ పూర్తయిన తర్వాత ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు విడుదల కానున్నాయి.
అసలు ఎగ్జిట్ పోల్స్ అంటే ఏమిటి?
ఎలక్షన్స్ లో భాగంగా కొన్ని మీడియా సంస్థలతో పాటు మరికొన్ని ప్రైవేటు సంస్థలు పోలింగ్ పూర్తయిన తర్వాత ప్రీ పోల్స్, ఎగ్జిట్ పోల్స్ అనే రెండు రకాల సర్వేలు నిర్వహిస్తుంటాయి. పోలింగ్ జరిగే కంటే ముందు నిర్వహించే సర్వేలను ప్రీపోల్స్ అంటారు. అంటే ఎలక్షన్ నోటిఫికేషన్ రాక ముందు, పార్టీల మధ్య పొత్తులు, సీట్ల సర్దుబాటుపై స్పష్టత రాకముందు, పార్టీలు అభ్యర్థులను ప్రకటించక ముందు.. అంటే పోలింగ్ తేదీకి చాలా రోజుల ముందు, లేదా పోలింగ్ తేదీ సమీపించినప్పుడు అసెంబ్లీ నియోజకవర్గాల వారిగా ఈ ప్రీ పోల్ సర్వే నిర్వహిస్తారు. ఇందులో భాగంగా కొంతమంది ఓటర్లను ఎంపిక చేసుకుని సర్వే నిర్వహిస్తారు. అలా ఓటర్లతో మాట్లాడి.. ఏ పార్టీకి విజయావకాశాలు ఎక్కువ ఉందన్న విషయాన్ని సేకరించి పోల్ ఫలితాలు వెల్లడిస్తారు. ఎగ్జిట్ పోల్ సర్వే.. అనేది ప్రీ పోల్స్ సర్వేకు పూర్తి భిన్నంగా ఉంటుంది. పోలింగ్ జరిగిన రోజే ఓటేసి వచ్చిన ఓటరు మనోగతం తెలుసుకుంటూ సర్వే నిర్వహించడమే ప్రీ పోల్స్.
ఎగ్జిట్ పోల్స్ జరిగే తీరు..
పోలింగ్ అయిపోయిన తర్వాత ఈ ఎగ్జిట్ పోల్ నిర్వహిస్తారు. ఎంపిక చేసిన పోలింగ్ కేంద్రాలకు ఆయా సంస్థల ప్రతినిధులు వెళ్తారు. వారు అక్కడ ఉన్న ఓటర్లు ఎక్కువమంది ఏ పార్టీకి ఓటు వేశారో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తారు. ఆయా పోలింగ్ కేంద్రాల్లో సేకరించిన సమాచారంతో ఏ నియోజవర్గంలో ఓ పార్టీ విజయం సాధించే అవకాశం ఎక్కువగా ఉందో ఓ నిర్ణయానికి వస్తారు. అలా నియోజవర్గాల వారీగా వచ్చిన సర్వేతో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయో ఓ అంచనా వేస్తారు. ఎగ్జిట్ పోల్‌లో పోలింగ్ రోజే.. ఓటింగ్‌లో పాల్గొన్నవారిని ప్రశ్నించి సమాచారం సేకరిస్తారు.
ఇంతకీ ఎగ్జిట్ పోల్స్ నిజమెంత?
ప్రీ పోల్ సర్వేలతో పోలిస్తే ఎగ్జిట్ పోల్స్‌లో కచ్చితత్వానికి ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. ఎగ్జిట్ పోల్ అంచనాలు అసలు ఫలితాలకు చాలా వరకు దగ్గరగా ఉంటాయి. గతంలో కూడా అలాంటి ఘటనలు అనేకం జరిగాయి. పోలింగ్ ఉదయం నుంచి సాయంత్రం వరకు జరుగుతుంది. సర్వే నిర్వాహకులు దాదాపు అన్ని వర్గాల ఓటర్లు వేర్వేరు సమయాల్లో కలిసి వారి స్పందన తెలుసుకునేందుకు ప్రయత్నిస్తారు. కానీ ఈ ప్రక్రియను ఎంత ఎక్కువ మంది పకడ్బందీగా, విస్తృతంగా నిర్వహిస్తేనే అంత కచ్చితమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. కానీ నామమాత్రంగా చేస్తే.. ఫలితాలు పూర్తి భిన్నంగా వచ్చే అవకాశం కూడా ఉంది. అందుకే కొన్ని సంస్థలు ప్రకటించిన ఎగ్జిట్ పోల్స్ పూర్తి రివర్స్ గా ఉంటాయి. మరికొన్ని నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ కు ఫలితాలు దగ్గరగా వస్తుంటాయి.