Gautam Gambhir : ఇండియన్ క్రికెట్ టీం కోచ్ గా గౌతం గంభీర్ ను నియమిస్తున్నట్లు బీసీసీఐ సెక్రటరీ జై షా ప్రకటించారు. ప్రధాన కోచ్ గా గౌతం గంభీర్ నియామకంతో రాహుల్ ద్రవిడ్ తర్వాత కోచ్ పదవి అందుకోనున్న ఇండియన్ క్రికెటర్ గా నిలవనున్నాడు. మంగళవారం ఈ విషయాన్ని అధికారికంగా ధ్రువీకరించారు. ముందు నుంచే గౌతం గంభీర్ వైపే మొగ్గు చూపిన బీసీసీఐ చివరగా కోచ్ పదవినీ అప్పగించింది.
ఈ పదవిలో గౌతం గంభీర్ 2027 వరకు తన బాధ్యతలు నిర్వర్తించనున్నాడు. 2025 చాంపియన్స్ ట్రోపీ, 2027 లో జరిగే ప్రపంచకప్, టెస్ట్ చాంపియన్ షిప్ ల వరకు గౌతం గంభీర్ కోచ్ గా తన ప్రస్తానాన్ని కొనసాగించనున్నారు. ఈ రెండేళ్ల పదవీ కాలంలో ఒక వన్డే వరల్డ్ కప్, చాంపియన్స్ ట్రోపీ, టెస్ట్ చాంపియన్ షిప్ ఐసీసీ టోర్నీలు ఇండియా ఆడనుంది.
అయితే కోచ్ గా నియామకం జరగకముందే చాలా కండిషన్లు పెట్టాడు గౌతం గంభీర్. తనకు కోచ్ స్టాప్ నియామకంలో స్వేచ్ఛ ఉండాలని చెప్పాడు. క్రికెట్ కు సంబంధించిన విషయాల్లో బయట వాళ్ల జోక్యం అస్సలు ఉండకూడదని కండిషన్లు పెట్టాడు. టీం ఇండియా కోచ్ గా పని చేయకముందు గౌతం గంభీర్ గతేడాది కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు కు మెంటార్ గా పని చేశాడు. ఈ సమయంలో పదేళ్ల తర్వాత కోల్ కతా నైట్ రైడర్స్ ఐపీఎల్ ట్రోపీ గెలిచింది.
అయితే సహాయక కోచ్ గా నియామకాల్లో కొన్ని మార్పులు జరగనున్నాయి. ప్రస్తుతం విక్రమ్ రాథోడ్ బ్యాటింగ్ కోచ్ గా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఇతడి స్థానంలో అభిషేక్ నాయర్ ను నియమించేందుకు రెడీ అయినట్లు తెలుస్తోంది. ఫీల్డింగ్ కోచ్ దిలీప్ ను కొనసాగించాలని గంభీర్ భావిస్తున్నట్లు సమాచారం. టీం ఇండియా గతంలో ఫీల్డింగ్ లో ఎంతో నాసిరకంగా ఉండేది. కానీ దిలీప్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఫీల్డింగ్ లో చాలా వరకు మెరుగుపడింది. బౌలింగ్ కోచ్ పరాస్ మాంబ్రే స్థానంలో వినయ్ కుమార్ ను సెలక్ట్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక వీరిందరి పేర్లు త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తారని తెలుస్తోంది.