Chandrababu : రాజకీయాల్లో ఏదీ శాశ్వతం కాదు. పదవులు, అధికారం ఏ క్షణాన గాలిలో కలిసిపోయేది ఎవరూ చెప్పలేదు. ఇక రాజకీయాల్లో ఆత్మహత్యలే తప్ప.. హత్యలుండవు అనే నానుడి ఉండనే ఉంది. ఇక పొలిటికల్ గా శాశ్వత మిత్రులు ఉండరు.. శాశ్వత శత్రువులూ ఉండరు. ఇక్కడ ఏదైనా అధికారమే నిర్ణయిస్తుంది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తో పాటు దేశ రాజకీయాల్లో చక్రం తిప్పిన చంద్రబాబు కొంత కాలం గడ్డు పరిస్థితులు ఎదుర్కొన్నాడు. ఒక దశలో పార్టీని కాపాడుకోవడానికి అష్టకష్టాలు పడ్డాడు. మళ్లీ తన టైమ్ కలిసొచ్చింది. ఎప్పటి లాగే మళ్లీ జాతీయ రాజకీయాల్లో ప్రస్తుతం కీ రోల్ ప్లే చేస్తున్న విషయం తెలిసిందే. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వానికి టీడీపీ ఆక్సిజన్ లాంటిది. ఏ కొంచెం అటు ఇటు అయినా ఎన్డీఏ కుప్ప కూలక తప్పదు.
అప్పుడు జైలులో.. ఇప్పుడు టాప్-5లో
ఏపీ ప్రస్తుత సీఎం చంద్రబాబు దాదాపు ఏడాది క్రితం ఇదే సమయంలో జైలులో ఉన్న విషయం తెలిసిందే. అప్పటి వైసీపీ ప్రభుత్వం స్కిల్ స్కామ్‌లో కేసులో అరెస్టు చేయించింది. కానీ ఏడాది తిరిగే సరికి అదే చంద్రబాబు దేశంలోనే మోస్ట్ పవర్‌ఫుల్ పర్సన్ జాబితాలో టాప్ -5లో నిలిచారు.
తాజాగా ఇండియా టుడే సంస్థ ప్రకటించిన మోస్ట్ పవర్‌ఫుల్ పొలిటిషీయన్ ఇన్ ఇండియా జాబితాలో ఏపీ సీఎం చంద్రబాబు ఐదో స్థానంలో నిలిచాడు. ఈ లిస్టులో ప్రధాని నరేంద్ర మోదీ ప్రథమ స్థానంలో నిలిచాడు. ఇక ఆర్‌ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ద్వితీయ స్థానంలో ఉన్నారు. మూడో స్థానంలో కేంద్ర మంత్రి అమిత్ షా, నాలుగో స్థానంలో కాంగ్రెస్ నేత రాహుల్, ఏపీ సీఎం చంద్రబాబు ఐదో స్థానంలో నిలిచారు.
ఇక బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి వరుసగా మూడోసారి కేంద్రంలో అధికారం చేపట్టడానికి, నరేంద్ర మోదీ వరుసగా మూడోసారి పీఎం కావడానికి ప్రధాన కారణం చంద్రబాబు సహకారమేననే విషయం జగమెరిగిన సత్యం. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో 23 సీట్లకు పరిమితమై ఘోర పరాజయం పాలైన టీడీపీ.. ఐదేళ్లు తిరిగేసరికి తిరిగి అధికారం చేపట్టేదిశగా నడిపించిన నేత చంద్రబాబు నాయుడు .