Huascaran Mountain : 22 ఏళ్ల క్రితం పర్వతారోహణకు వెళ్లి అదృశ్యమైన ఓ అమెరికా వ్యక్తి మృతదేహం ఇటీవల పెరూలో బయటపడింది. పోలీసులు తెలిపిన ప్రకారం.. 2002లో అమెరికాకు చెందిన విలియం స్టాంప్ ఫ్ల్ (59) అనే పర్వతారోహకుడు పెరూలోని హుస్కరన్ పర్వతాన్ని అధిరోహించారు. దీని ఎత్తు 6,700 మీటర్లు (22,000 అడుగులు). పర్వతం ఎక్కుతుండగా ఆయన అదృశ్యమయ్యాడు. పోలీసులు గాలింపు చర్యలు చేపట్టినా అతని ఆచూకీ లభించలేదు. దీంతో ఆ పర్వతారోహకుడి కుటుంబం అతడిపై ఆశలు వదులుకుంది. కాగా, తాజాగా వాతావరణంలో మార్పుల వల్ల పర్వతం మీద ఉన్న మంచు కరుగుతోంది. అలా మంచు కరుగుతున్న సమయంలో 22 ఏళ్ల క్రితం అదృశ్యమైన పర్వతారోహకుడి మృతదేహం బయటపడింది.
ఇన్నాళ్లు శరీరంపై మంచు దట్టంగా పేరుకుపోవడంతో అతడి శరీరం మునపటిలానే ఉంది. ఒంటిపైన దుస్తులు, షూ, పాస్ పోర్టు ఏ మాత్రం చెడిపోలేదు. పాస్ పోర్టు ఆధారంగా వారి కుటుంబ సభ్యులను సంప్రదించామని, మృతదేహాన్ని వారికి అప్పగిస్తామని పోలీసులు తెలిపారు.