Nara Lokesh: వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు సీఎం చంద్రబాబు మద్దతిస్తున్నారని డెక్కన్ క్రానికల్ ఆంగ్ల దినపత్రిక కథనాన్ని ప్రచురించింది. ఈ కథనం ఏపీలో కలకలం సృష్టించింది. ఇదంతా బ్లూ మీడియా కుట్ర అని టీడీపీ నేతలు, కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం విశాఖపట్నంలోని డెక్కన్ క్రానికల్ కార్యాలయం ఎదుట నిరసనకు దిగి సంస్థ నేమ్ బోర్డును తగులబెట్టారు. ఈ వీడియోను పోస్ట్ చేసిన డెక్కన్ క్రానికల్ మా సంస్థ కార్యాలయంపై టీడీపీ గూండాలు దాడి చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నేమ్ బోర్డుకు నిప్పు పెట్టిన వీడియోను పోస్ట్ చేసి.. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై నిష్పక్షపాత కథనాన్ని ప్రచురించామని తెలిపారు. ఇలాంటి బెదిరింపులకు భయపడేదేలేదని ట్వీట్ చేశారు.
విశాఖలోని డెక్కన్ క్రానికల్ కార్యాలయంపై దాడి పిరికిపంద చర్య అని, దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ ట్వీట్ చేశారు. నిష్పక్షపాత మీడియాను అణిచివేసేందుకు టీడీపీ చేస్తున్న మరో ప్రయత్నమిదని అన్నారు. కూటమి పాలనలో ఆంధ్రప్రదేశ్‌లో ప్రజాస్వామ్య ఉల్లంఘన జరుగుతోందని, ఈ ఘటనలకు సీఎం చంద్రబాబే బాధ్యత వహించాలని జగన్ డిమాండ్ చేశారు.
దాడిని లోకేష్ ఖండించారు..
వైజాగ్‌లో డెక్కన్ క్రానికల్ ఆఫీసుపై దాడిని మంత్రి నారా లోకేష్ ఖండించారు. తమ పార్టీ నాయకులు, కార్యకర్తలు సంయమనం పాటించాలని కోరారు. పక్షపాతంతో కుమ్మక్కై ఇలాంటి వార్తలు రాస్తున్న బ్లూ మీడియా సంస్థలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. అంతే కానీ ఇలా దాడులు చేయడం సరికాదన్నారు. ఈ కథనంపై టీడీపీ కూడా స్పందిస్తూ.. డెక్కన్ క్రానికల్ ప్రతినిధులతో మాజీ సీఎం జగన్ ఉన్న ఫొటోను పోస్ట్ చేస్తూ ‘వెల్ ప్లేయ్డ్’ అంటూ ట్వీట్ చేసింది.