Yarlagadda : గన్నవరం కూటమి అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు బాపులపాడు మండలం తేంపల్లి, కొయ్యూరు గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా తెంపల్లి గ్రామస్థులు యార్లగడ్డ వెంకట్రావుకు ఎక్స్ కవేటర్లతో స్వాగతం పలికి వారి అభిమానాన్ని చాటుకున్నారు. ప్రచారంలో భాగంగా యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడారు.
వైసీపీ ప్రభుత్వాన్ని కూకటి వేళ్లతో సహా పెకిలించాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పారు. గన్నవరం నియోజకవర్గంను అభివృద్ధి చేయడమే తన ధ్యేయమని తెలిపారు. ఈ నియోజకవర్గానికి ఐటీ కంపెనీలు తీసుకొస్తానని, యువతకు ఉపాధి లభించేలా కృషి చేస్తానని యార్లగడ్డ ప్రకటించారు. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కక్ష సాధింపు చర్యలకు పాల్పడనని, కేసులు పెట్టి వేధించేందుకు రాజకీయాలలోకి రాలేదన్నారు. వైసీపీని వీడిన తర్వాత తనపై కేసులు నమోదు చేశారని ఆయన గుర్తు చేశారు. ప్రజల సమస్యలను పరిష్కరించి, ప్రజలకు సేవ చేయడానికే రాజకీయాల్లోకి వచ్చానని యార్లగడ్డ వెంకట్రావు వెల్లడించారు.