Weather Report : అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరోవైపు అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఏపీ తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు వీస్తాయని హెచ్చరించింది. పలు జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేశారు. హైదరాబాద్ కు పింక్ హెచ్చరిక జారీ చేసింది. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంపై వాతావారణ శాఖ తాజా సమాచారం ఇచ్చింది. ఇది పశ్చిమ-వాయువ్య దిశగా ఉత్తర ఆంధ్ర, దక్షిణ ఒడిశా తీరాల వైపు కదులుతూ వాయుగుండంగా బలపడుతుందని అంచనా వేసింది.
ఈరోజు (ఆగస్టు 31) ఏపీలో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతామరాజు, విశాఖపట్నం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, వైఎస్ఆర్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. నేడు అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, శ్రీ సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని… అత్యవసరం అయితే తప్ప ప్రజలు బయటక రావొద్దని కోరింది. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. తీరం వెంబడి ఈదురు గాలులు వీస్తాయని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని హెచ్చరికాలు జారీ చేసింది.
తెలంగాణలోనూ నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈరోజు (ఆగస్టు 31) ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్‌లు జారీ చేశారు. నిర్మల్, నిజామాబాద్, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, జనగాం, సిద్దిపేట, వికారాబాద్, సంగారెడ్డి, గద్వాల జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌లు జారీ చేశారు. సెప్టెంబరు 3 వరకు తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని, ఈ రోజుల్లో ఈదురు గాలులు వీస్తాయని తెలిపింది. ఆ తర్వాత తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వివరించింది.