Weather Alerts : అయ్యా సూర్య..హాఫ్ సెంచరీ కొట్టేస్తావా ఏంటి?
Weather Alerts : ఆంధ్రప్రదేశ్ లో వేడి పెరుగుతోంది. ఎండల తీవ్రత అధికమవుతోంది. జనాలు బయటకు రావడానికే జంకుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎండ ధాటికి బెంబేలెత్తిపోతున్నారు. రాబోయే ఎండల తీవ్రత ఇంకా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో ఎండల తీవ్రత దిమ్మతిరిగే విధంగా నమోదవుతున్నాయి. చిత్తూరు నుంచి శ్రీకాకుళం వరకు 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో వడగాలుల ప్రభావం ఉంది. రాయలసీమ జిల్లాల్లో దీని ప్రభావం మరింత ఎక్కువగా కనిపిస్తోంది. ఉష్ణోగ్రతల్లో భారీ తేడాలు కనిపిస్తున్నాయి. శుక్రవారం నంద్యాలలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. గోస్సాడు, బండి ఆత్మకూరుల్లో 47.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఇంత స్థాయిలో ఉష్ణోగ్రత నమోదు కావడం ఇదే తొలిసారి.
ప్రకాశం జిల్లా అర్ధవీడులో 47.3, కడప జిల్లా చెన్నచెప్పలిలో 47.2, నెల్లూరు జిల్లా వేసినాపి, అక్కమాంబపురం 47.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. 15 జిల్లాల్లో 44 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదైనట్లు విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. ప్రకాశం జిల్లాలో 38 మండలాల్లో తీవ్ర వడగాలులు వీస్తున్నాయి.
నెల్లూరు-37, కడప -36 మండలాల్లో వడగాల్పులు వీస్తున్నాయి. తిరుపతి 34, శ్రీసత్యసాయి32, చిత్తూరు 31, అనంతపురం 31, అన్నమయ్య రాచోటి 30, నద్యాల 29, ఏలూరు 28 మండలాల్లో ఎండల తీవ్రత అధికంగా ఉంది. ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయి. దీంతో జనం బయటకు రావడానికి జంకుతున్నారు. అత్యవసరమైతే తప్ప బయట తిరగడం లేదు.
ఒకవేళ బయటకు వచ్చినా నెత్తిన టోపీ, తలకు రుమాలు, వదులుగా ఉండే దుస్తులు, చేతిలో నీళ్ల సీసా వెంట ఉండాలి. శరీరం డీ హైడ్రేడ్ అయితే వడదెబ్బ సోకే ప్రమాదం ఉంటుంది. వడదెబ్బతో చాలా మంది చనిపోతున్నారు. అందుకే సాధ్యమైనంత వరకు బయటకు రావొద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు.