Weather Alert : తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండుతున్నాయి. మార్చి నెల ప్రారంభంలోనే భాణుడు దంచికొడుతుండడంతో జనాలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. పలు జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 37 డిగ్రీల సెల్సియస్ ను దాటాయి. విజయవాడలో 37 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇటు తెలంగాణలోనూ అత్యధికంగా సిద్దిపేట, ములుగు, వనపర్తి జిల్లాల్లో 39 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. రాత్రిపూట కూడా ఉక్కపోత పెరిగింది. పగటి పూట ఉష్ణోగ్రతలు పెరగడమే కాదు వేడిగాలుల తీవ్రత క్రమంగా పెరుగుతోంది.
ఈ నెలలో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. కొన్ని ప్రాంతాల్లో 40 డిగ్రీలు దాటుతుందని, ఏప్రిల్, మే నెలల్లో ఎండలు మరింత పెరుగుతాయని పేర్కొంది. ఎండదెబ్బ వల్ల చిన్నారులు, మహిళలు, వృద్ధులు ఇబ్బందులు పడే అవకాశం ఉందని తగు జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించింది. ఎండల సమాచారం కోసం 112, 1070 కు కాల్ చేయాలని ఏపీ శాఖ సూచించింది.
మార్చిలోనే ఎండలు దంచికొడుతుండడంతో రాబోయే రోజుల్లో పరిస్థితి మరింత తీవ్రంగా ఉండనుంది. వడగాలులతో డీహైడ్రేషన్ బారిన పడే అవకాశం ఉంది. వీలైనంత వరకు ఎండకు వెళ్లపోవడమే మంచిది. బయట పనులుంటే ఉదయం, సాయంత్రం వేళల్లో చేసుకోవాలి. ఇక బయట పనులు చేసుకోక తప్పనివారు క్యాప్, తెల్లటి బట్టలు ధరించాలి. గొడుగు పట్టుకెళ్లడం మరిచిపోవద్దు. శీతల పానియాల కన్నా కొబ్బరినీళ్లు, పండ్ల రసాలు తీసుకోవడం మేలు. నీళ్లు అధికంగా తాగాలి. గ్లూకోజ్ కూడా తీసుకోవడం మంచిది.