Weather Alert : తెలుగు రాష్ట్రాల్లో భానుడు ఉగ్రరూపం దాలుస్తున్నాడు. రానున్న మూడు రోజులపాటు 3 నుంచి 5 డిగ్రీల సెంటిగ్రేడ్ ల అధిక ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది.
గురువారం నుంచి మరో 2 రోజులు తెలంగాణలోని పలు జిల్లాలో వడగాడ్పులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, పెద్దపల్లి, నల్గొండ, మంచిర్యాల, సూర్యాపేట జిల్లాల్లో మరింత తీవ్రంగా వడగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ జిల్లాలకు చెందిన ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎల్లో అలర్ట్ జారీ చేశారు.
2015, 2016 సంవత్సరాల్లో ఉమ్మడి రాష్ట్రంలో అత్యంత భారీ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆ రెండు సంవత్సరాల్లో ఎండ వేడిమికి ఎంతో మంది మరణించారు. మళ్లీ ఇప్పుడు సూర్యుడు ప్రతాపం చూపిస్తుండడంతో వాతావరణ శాఖ అధికారులు ముందస్తు అలర్ట్ జారీ చేశారు.
మరీ వాయిదా వేయలేని అత్యవసర పనులు ఉంటే తప్ప బయటకు రావద్దని, పనులను సాధమైనంత వరకు ఉదయం 10 గంటల వరకు సాయంత్రం 5 గంటల తర్వాత పోస్ట్ పోన్ చేసుకుంటే మంచిదని సూచిస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో బయటకు వస్తే నెత్తిపై టవల్, క్యాప్, లేదంటే ఏదైనా ఆచ్చాదనం వసుకొని, తగిన జాగ్రత్తలు తీసుకొని రావాలని సూచించారు.