JAISW News Telugu

CM Chandrababu : విశాఖలో ‘రామోజీరావు చిత్రపురి’ ఏర్పాటు చేస్తాం: ఏపీ సీఎం చంద్రబాబు

CM Chandrababu

CM Chandrababu

CM Chandrababu : విశాఖ పట్టణంలో రామోజీరావు చిత్రపురి ఏర్పాటు చేస్తామన్నారు సీఎం చంద్రబాబు నాయుడు. నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేసిన వ్యక్తి రామోజీరావు అని ఆయన కొనియాడారు. ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత, మీడియా మొఘల్  రామోజీరావు కొన్నిరోజుల కిందట తీవ్ర అనారోగ్యంతో చనిపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం నేడు విజయవాడలో రామోజీరావు సంస్మరణ సభ ఏర్పాటు చేసింది.  

ఈసభలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ..రామోజీరావు ప్రజల ఆస్తి అని ఆయన స్థాపించిన వ్యవస్థలను భావితరాలకు అందించాలన్నారు. తెలుగు భాష, తెలుగు జాతి అంటే ఎనలేని ఆప్యాయత అని, తెలుగు జాతికి ఆయన చేసిన సేవలకు గానూ తగిన గుర్తింపు రావాలన్నారు. ఎన్టీఆర్ కు, రామోజీరావుకు భారత రత్న సాధించడం మన బాధ్యత అని ఆకాంక్షించారు. అమరావతిలో రామోజీ విజ్ఞాన కేంద్రం ఏర్పాటు చేస్తామన్నారు. రాష్ట్రంలో ఒక రోడ్డుకు రామోజీ మార్గం అని పేరు పెడుతామన్నారు. హైదరాబాద్ అభివృద్ధిలో రామోజీరావు పాత్ర ఎంతో ఉందని కొనియాడారు. నవ్యాంధ్రకు ఏ పేరు పెట్టాలా? అన్న ఆలోచన చేస్తుండగా రీసెర్చి చేసి మరి రామోజీరావే ‘అమరావతి’ పేరును సూచించారన్నారు. ఐదేళ్లపాటు ఇబ్బందులు ఎదుర్కొన్నా ఇక నుంచి అమరావతి దశ, దిశ మారుతుందన్నారు. తెలుగు జాతి ఉజ్వల భవిష్యత్ కు నాంది పలుకుతుందన్నారు.

అంతకుముందు డిప్యూటీ సీఎం పవన్ మాట్లాడుతూ..ప్రజాసమస్యల పరిష్కారానికి రామోజీరావు రాజీలేని పోరాటం చేశారని చేశారన్నారు. 2008లో మొదటిసారి రామోజీరావును కలిశాను. ఆయన మాట్లాడే విధానం తనను చాలా ఆకర్షించిందన్నారు. ప్రజాసంక్షేమం కోణంలోనే ఆయన ఎప్పుడూ మాట్లాడేవారని పవన్ అన్నారు. పత్రికా స్వేచ్ఛ ఎంత అవసరమో రామోజీరావు వివరించారు. రామోజీరావు మాటల్లో జర్నలిజం విలువలే నాకు కనిపించాయన్నారు.

కాగా, ఇక్కడ ఏర్పాటు చేసిన రామోజీరావు ప్రస్థానం ఛాయాచిత్రాల ప్రదర్శనను వారు తిలకించారు. రామోజీరావు కుటుంబ సభ్యులు స్పెషల్ బస్సులో రాగా, వారికి ఏపీ మంత్రి కొలుసు పార్థసారథి స్వాగతం పలికారు. ఆ పాత్రికేయ దిగ్గజం చిత్రపటానికి వారు నివాళులు అర్పించారు.  సీనియర్ నటులు మురళీమోహన్, జయసుధ, మంత్రులు, దేశంలోని ప్రముఖ పాత్రికేయులు, మీడియా సంస్థల అధిపతులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

Exit mobile version