Tungabhadra Gate : కొట్టుకుపోయిన తుంగభద్ర క్రస్ట్ గేటును వారం రోజుల్లో పునర్నిర్మిస్తామని కర్ణాటక జలవనరుల శాఖ బాధ్యతలు చూస్తున్న డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ వెల్లడించారు. ఆయన ఆదివారం మధ్యాహ్నం తుంగభద్ర ఆనకట్టపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం విలేకర్లతో మాట్లాడారు.
క్రస్ట్ గేటు కొట్టుకుపోవడానికి స్పష్టమైన కారణాలు తెలియవని అన్నారు. గేటు, ఇనుప గొలుసు నడుమ ఉన్న వెల్డింగ్ దెబ్బతినడంతో ఈ ఘటన జరిగినట్లు ఇంజనీర్లు చెబుతున్నారని చెప్పారు. హైదరాబాద్, బెంగళూరు, జిందాల్ ఇంజనీర్లను సంప్రదిస్తున్నట్లు తెలిపారు. ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి లతో చర్చించి భవిష్యత్తు ప్రణాళికను సిద్ధం చేస్తామని ఆయన వెల్లడించారు. ప్రాజెక్టులో కనీసం 53 టీఎంసీల నీరు నిల్వ ఉంచి పునర్నార్మాణ పనులు చేపట్టాలని ఇంజనీర్లను ఆదేశించినట్లు డిప్యూటీ సీఎం శివకుమార్ వివరించారు.