BJP MP Ramesh : ఆంధ్రా యూనివర్శిటీ వీసీ ప్రసాద రెడ్డి రాజీనామాతో యూనివర్సిటీలో విద్యార్థులు సంబరాలు చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా విశ్వవిద్యాలయానికి పూర్వ విద్యార్థులు భారీ సంఖ్యలో చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ ఎంపీ సి.ఎం.రమేశ్, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తదితరులు అక్కడికి వెళ్లారు. నాయకులకు ఆంధ్రా వర్సిటీ విద్యార్థులు, పరిశోధకులు ఘన స్వాగతం పలికారు.
యూనివర్సిటీలో విద్యార్థుల అభివృద్ధికి దోహదపడే పాలకవర్గం ఉంటుందని సి.ఎం. రమేశ్ తెలిపారు. విశ్వవిద్యాలయంలో జరిగిన అవినీతిపై న్యాయవిచారణ చేయిస్తామన్నారు. అవినీతిపై గవర్నర్ కు కూడా ఫిర్యాదు చేస్తామని చెప్పారు. ఏయూలో మళ్లీ పూర్వ పరిస్థితులు రప్పిస్తామని గంటా శ్రీనివాసరావు తెలిపారు. యూనివర్సిటీలో అనేక అక్రమాలు జరిగాయన్నారు. నిబంధనలకు విరుద్ధంగా పరీక్షలు పెట్టారని, నియామకాలు చేశారని ఆరోపించారు. వీసీ ప్రసాద రెడ్డిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతామని పేర్కొన్నారు.