KCR Farm House : తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కు అధికారం కోల్పోయిన తలనొప్పులు తగ్గడం లేదు. ఇప్పటికే పార్టీ నుంచి కీలక నేతలు ఇతర పార్టీల్లోకి జంప్ అవుతున్నారు. కుమార్తె కవిత అరెస్ట్ తో పాటు ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం అవినీతి తదితర కేసులతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ ఫామ్ హౌస్ దగ్గర డబుల్ బెడ్రూం లబ్ధిదారులు నిరసన చేపట్టారు. డబుల్ బెడ్రూంలకు తమను ఎంపిక చేసినప్పటికీ ఇప్పటివరకు తమకు ఇండ్లు పంపిణీ చేయకపోవడంతో కొంత మంది లబ్ధిదారులు శుక్రవారం ఉదయం కేసీఆర్ ఫామ్ హౌస్ గేటు ముందు నిరసన తెలిపారు.
గజ్వేల్ ఎమ్మెల్యేగా కేసీఆర్ ను మూడు సార్లు గెలిపించామని, సీఎంగా గెలిచినప్పటి నుంచి తమకేం చేశారని నిలదీశారు. అందరికీ డబుల్ బెడ్రూంలు ఇచ్చారని, కానీ తమను మాత్రం రోడ్డు మీద నిలబెట్టారని కేసీఆర్ పై మండిపడ్డారు. ‘‘మేము పిచ్చోళ్ల లెక్క కనిపిస్తున్నామా? కలెక్టరేట్ కు పోయినం.. సిద్దిపేట వచ్చినం.. ఇళ్లు ఇచ్చుడు చేతికానప్పుడు.. డ్రా ఎందుకు తీసినవ్? ’’అంటూ కేసీఆర్ ను నిలదీశారు. దీంతో ఫామ్ హౌస్ దగ్గర ఉన్న పోలీసులు నిరసన కారులను అడ్డుకున్నారు. అయితే కేసీఆర్ ను కలిసేంత వరకు అక్కడి నుంచి వెళ్లిపోమంటూ తేల్చిచెప్పారు.
ఇప్పటికే పలు సమస్యలతో కేసీఆర్ సతమతమవుతుంటే కొత్తగా ప్రజల్లో వచ్చిన ఈ వ్యతిరేకత ఆయన్ను ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి. రాష్ట్రమంతటా డబుల్ బెడ్రూం బాధితులు లక్షల్లో ఉన్నారు. పలు చోట్ల ఇండ్లు కట్టినా ఇప్పటివరకు వాటిని పంపిణీ చేయలేదు. కోట్ల రూపాయలు పెట్టి కట్టిన ఇండ్లు ఇప్పటికే బీటలు వారుతున్నాయి. చెట్లు మొలవడమే కాదు ఇండ్లలో అసాంఘిక కార్యకలపాలు కొనసాగిస్తున్నారు. ఈ సమస్యలన్నీ త్వరలో జరుగబోయే లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ప్రతికూలంగా మారే అవకాశాలు కనపడుతున్నాయి. అధికారం కోల్పోయినా ప్రజల్లో వ్యతిరేకత మాత్రం తగ్గడం లేదని బీఆర్ఎస్ నేతలు తలలు పట్టుకుంటున్నారు.