CM Revanth Reddy : ఐటీఐలను ఆధునీకరించి యువతకు ఉపాధి కల్పిస్తాం: సీఎం రేవంత్ రెడ్డి
CM Revanth Reddy : ఐటీఐలను ఆధునీకరించి యువతకు ఉపాధి కల్పిస్తామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ మల్లేపల్లి ఐటీఐలో ఏటీసీలకు సీఎం మంగళవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగ, ఉపాధి అంశాలే కీలకంగా మారాయన్నారు. యువతకు చేదోడుగా ఉండాలనే ఉద్దేశంతో ఐటీఐలను ప్రక్షాళన చేయాలని ప్రజా ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. వాటిని అడ్వాన్స్ డ్ ట్రైనింగ్ సెంటర్లుగా అప్ గ్రేడ్ చేయాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. ఈ ప్రయత్నంలో తోడ్పడేందుకు ముందుకొచ్చిన టాటా సంస్థకు సీఎం ధన్యవాదాలు తెలియజేశారు. రాష్ట్రంలోని 65 ఐటీఐలను అధునాతనంగా తీర్చిదిద్దే కార్యక్రమాన్ని త్వరలోనే చేపడతామని సీఎం తెలిపారు.
రాష్ట్రంలోని ఐటీఐలను ఆధునికీకరణ చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. అందుకోసం రూ.2,324.21 కోట్ల నిధులు ఖర్చు చేయనుంది. ఐటీఐలను అప్ గ్రేడ్ ట్రైనింగ్ సెంటర్లుగా మార్చనుంది. ఏటీసీలుగా మార్చేందుకు టాటా టెక్నాలజీస్ లిమిటెడ్ తో అవగాహన ఒప్పందం కుదిరింది. ఆధునిక పరిశ్రమల అవసరాలకు తగినట్లుగా వాటిలో యువతకు శిక్షణ ఇవ్వనున్నారు. అందుకోసం అధునాతన సామగ్రి, సాంకేతికత ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.