CM Chandrababu : ఏపీలో జరిగిన మద్యం పాలసీలో అక్రమాలపై సీఐడీతో విచారణ జరిపిస్తామని సీఎం చంద్రబాబు అసెంబ్లీలో ప్రకటించారు. ఎక్పైజ్ శాఖలో జరిగిన అవినీతిపై చర్యలు తీసుకోవాలన్న పవన్ కల్యాణ్ విజ్ఞప్తిపై సీఎం సభలో మాట్లాడారు. లోతైన విచారణ తర్వాత అవసరమైతే ఈ అంశాన్ని ఈడీకి సిఫార్సు చేస్తామని అన్నారు. ఎక్సైజ్ శాఖపై బుధవారం అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ‘‘సీఐడీ విచారణలో వాస్తవాలు తేలస్తాం. మొత్తం నగదు లావాదేవీలు చేశారు. దీనిపై ఈడీకి కూడా ఫిర్యాదు చేస్తాం. అక్రమాలకు పాల్పడినవారిని కఠినంగా శిక్షిస్తాం’’ అని సీఎం వెల్లడించారు.
ప్రభుత్వంలోని ఇతర శాఖల్లో డబ్బును తీసుకొచ్చి ఎక్సైజ్ శాఖలో పెట్టుబడి పెట్టించారు. దీంతో ఆయా శాఖలకు దాదాపు రూ.250 కోట్ల నష్టం వాటిల్లింది. ఎక్సైజ్ శాఖను పూర్తిగా ప్రక్షాళన చేయాలి. సరైన పాలసీలు తీసుకొచ్చి పేదలకు అందుబాటు ధరలో మద్యం లభించే విధంగా చూడడంతో పాటు డీఅడిక్షన్ సెంటర్లను ఏర్పాటు చేయాల్సిన అవసరముందని చంద్రబాబు సూచించారు.