CM Revanth Reddy : చివరి ధాన్యం గింజ వరకూ కొంటాం : సీఎం రేవంత్ రెడ్డి
CM Revanth Reddy : రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను వేగవంతం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా రానున్న వారం, పది రోజుల్లో ధాన్యం పెద్ద ఎత్తున కొనుగోలు కేంద్రాలకు వస్తుందని, కీలకమైన ఈ సమయంలో అందుకు అనుగుణంగా అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేసేలా చూడాలని స్పష్టం చేశారు. మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారంలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్రంలో ఖరీఫ్ ధాన్యం సేకరణపై సమీక్ష నిర్వహించారు. చివరి గింజ వరకూ ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని రైతులకు భరోసా ఇచ్చారు. తక్కువ ధరకు ప్రైవేటు వ్యక్తులకు అమ్ముకోవలసిన అవసరం లేదని సూచించారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో మిల్లర్లు కాని, వ్యాపారులు కాని ఇబ్బంది పెడితే సహించేది లేదని, ఎస్మా ప్రయోగిస్తామని హెచ్చరించారు.
ఖరీఫ్ సీజన్ లో రైతుల నుంచి 80 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలని పౌరసరఫరాల సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. 7,234 కొనుగోలు కొనుగోలు కేంద్రాల్ని ఏర్పాటు చేశారు. నవంబరు 12వ తేదీ నాటికి 7.26 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. గత ఏడాది ఇదే తేదీ నాటికి 7.65 లక్షల టన్నుల ధాన్య కొనుగోళ్లు జరిగాయి.