Chandrababu : తిరుమల పవిత్రతకు పూర్వ వైభవం తీసుకొస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. తప్పు చేసిన ఏ ఒక్కరినీ వదిలిపెట్టమని హెచ్చరించారు. తప్పు చేసిన వారు చరిత్ర హీనులుగా మిగిలిపోయేలా కఠినంగా శిక్షిస్తామన్నారు. మీడియాతో సీఎం మాట్లాడారు. తిరుమలకు 200 ఏళ్ల పైబడిన చరిత్ర ఉంది. ఇంట్లో స్వామివారి లడ్డూ ఉంటే ఇళ్లంతా ఘుమఘుమలాడే వాసన వచ్చేదని తెలిపారు. అంతటి పవిత్రత, విశిష్టత ఉన్న లడ్డూను కల్తీ చేయడమే కాక జగన్ ఎదురుదాడి చేస్తారా.. ప్రజలు గుణపాఠం చెప్పినా బుద్ధి మార్చుకోరా అని ప్రశ్నించారు. స్వామివారి అన్న ప్రసాదం స్ఫూర్తితోనే అన్న క్యాంటీన్లు పెట్టామన్నారు.
తిరుమల శ్రీవారి విషయంలో ఒకటికి పదిసార్లు ఆలోచిస్తామని, స్వామివారి విషయంలో అపచారం తలపెట్టే మాటలు పొరపాటున కూడా చేయమని పేర్కొన్నారు. వాస్తవాలతో భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయనే బాధ తనకు ఉందని సీఎం చెప్పారు. అలాగని గత పాలకులు చేసిన దుర్మార్గాలు చూస్తూ ఊరుకోమని చంద్రబాబు అన్నారు.