Nitin Gadkari : ఇతర పార్టీలతో పోలిస్తే బీజేపీ భిన్నాభిప్రాయాలు కలిగినదన, అందుకే ప్రజలు పదే పదే ఎన్నుకుంటున్నారని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. గతంలో కాంగ్రెస్ చేసిన తప్పులను మళ్లీ చేయొద్దని గడ్కరీ సున్నితంగా హెచ్చరించారు. పనాజీలో జరిగిన గోవా బీజేపీ కార్యవర్గ సమావేశం పాల్గొన్న గడ్కరీ కీలక వ్యాఖ్యలు చేశారు.
రానున్న రోజుల్లో రాజకీయాలు సామాజిక, ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చే సాధనమని పార్టీ కార్యకర్తలు తెలుసుకోవాలన్నారు. అవినీతి రహిత దేశాన్ని మనం సృష్టించాలని, అందుకు ప్రణాళికలు రూపొందించుకోవాలన్నారు. తన సొంత రాష్ట్రం (మహారాష్ట్ర)లో కుల సంబంధిత రాజకీయాలకు చోటులేదన్నారు. ఎవరైతే కుల రాజకీయాలు మాట్లాడతారో వారికి గట్టి దెబ్బ తగులుతుంది అని గడ్కరీ హెచ్చరించారు. 2027 ఎన్నికల్లో బీజేపీ అధికారాన్ని నిలబెట్టుకునేలా ప్రతి నియోజకవర్గాన్ని సందర్శించాలని, ప్రతి కార్యకర్త పార్టీ బలోపేతానికి కృషి చేయాలని గోవా బీజేపీ కార్యకర్తలకు గడ్కరీ దిశానిర్దేశం చేశారు.