Wayanad : వయనాడ్ విలయం.. కేరళ సీఎం సహాయ నిధికి అదానీ, విక్రం భారీ విరాళాలు
Wayanad : వయనాడ్ ప్రమాద బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు పలువురు ప్రముఖులు కేరళ సీఎం సహాయనిధికి విరాళాలు ప్రకటిస్తున్నారు. వయనాడ్ లో కొండచరియలు విరిగిపడిన ఘటనలో దాదాపు 180 మందికి పైగా మృతి చెందిన ఘటన యావత్ దేశాన్ని కలిచివేస్తోంది. ఈ క్రమంలో బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు ప్రభుత్వంతో పాటు దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులు ముందుకు వస్తున్నారు.
వయనాడ్ విషాదంపై అదానీ గ్రూప్ తీవ్ర విచారం వ్యక్తం చేసింది. ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబ సభ్యులకు ప్రముఖ పారిశ్రామిక వేత్త గౌతమ్ అదానీ ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు రూ.5 కోట్ల విరాళం ప్రకటించారు. అదానీ గ్రూప్ తో పాటు, ఆర్పీ గ్రూప్ రవి పిళ్లై, లులు గ్రూప్ ఇంటర్నేషనల్ ఛైర్మన్ ఎం.ఎ.యూసఫ్ అలీ, కల్యాణ్ జువెల్లర్స్ ఛైర్మన్ ఎండీ టి.ఎస్.కల్యాణరామన్ లు కూడా ఒక్కొక్కరూ రూ.5 కోట్ల విరాళాన్ని సీఎం సహాయనిధికి అందిస్తున్నట్లు ప్రకటించారు.
వయనాడ్ ఘటనపై నటుడు విక్రమ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలను ఆదుకునేందుకు సీఎం రిలీఫ్ ఫండ్ కు రూ.20 లక్షలు విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించారు.