Save Vijayawada : ‘నీటి ఎద్దడి.. కాలుష్యం.. విజయవాడను కాపాడండి’
Save Vijayawada : గత 2 నెలలుగా నగరంలో తీవ్రమైన నీటి ఎద్దడి, కాలుష్యంతో ప్రజారోగ్యం దెబ్బతింటున్నదని.. విజయవాడను కాపాడాలంటూ కమ్యూనిస్టు నేతలు గళం విప్పారు. నేడు విజయవాడ 59వ డివిజన్ అజిత్ సింగ్ నగర్ లో “మార్పు కోసం సిపిఎం” పాదయాత్ర, ఇంటింటి ప్రచారం కొనసాగింది. విజయవాడ సెంట్రల్ లో సి.పి.ఎం.ను గెలిపించాలంటూ సి.పి.ఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా బాబు రావు మాట్లాడుతూ.. విజయవాడ నగరం, అజిత్ సింగ్ నగర్ వామపక్షాల హయాంలోనే బాగుపడిందన్నారు.. మంత్రులు, ప్రజా ప్రతినిధులుగా పదవులు వెలగబెట్టి నగరానికి ఏమి చేశారని నిలదీశారు. దోమలు చెండాడుకు తింటున్నా ఉలుకూ, పలుకులేని పాలకులన్నారు.. పన్నులు పెంచడంపై దృష్టి తప్ప, పౌర సదుపాయాల కల్పనపై శ్రద్ధ లేని ప్రజా ప్రతినిధులు.. గత పదేళ్ళ తెలుగుదేశం, వైసీపీ పాలనలోవిపరీతంగా పెరిగిన నీటి చార్జీలు, నీటి మీటర్ల పై కుట్ర పన్నుతున్న కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు తీరును ఆయన కడిగేశారు. మంచినీటి ఎద్దడి, నీటి కాలుష్యం, పార్కుల్లో దెబ్బతిన్న క్రీడా పరికరాలు, చెత్తపన్ను, ఇతర భారాలు, తదితర అంశాలపై ప్రజలు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా బాబురావు మాట్లాడుతూ.. ‘‘ మంత్రి పదవులు వెలగబెట్టిన వైసిపి, తెలుగుదేశం నేతలు విజయవాడ నగరానికి ఏమి చేశారో సమాధానం చెప్పాలి. తెలుగుదేశం, వై.సి.పి. పాలనలో శాసనసభ్యులుగా, పార్లమెంటు సభ్యులుగా, మంత్రులుగా పనిచేసిన నేతలు నగరాభివృద్ధికి చేసింది తక్కువ. భారాలు మోపింది ఎక్కువ. గత 2నెలల నుండి నగరంలో నీటి ఎద్దడితో ప్రజలు అనేక అవస్థలు పడుతున్నా, నీటి కాలుష్యంతో ప్రజారోగ్యం దెబ్బతింటున్నా పట్టించుకునే నాధుడు లేడు.
కృష్ణానది నీటిమట్టం తగ్గటంతో రాబోయే కాలంలో మరింత నీటి ఎద్దడి పెరిగే ప్రమాదం ముంచుకొస్తున్నదని బాబు రావు అన్నారు. వేసవిలో నీటి సమస్య పరిష్కారానికి ముందస్తు కార్యాచరణ ప్రణాళిక రూపొందించడంలో నగరపాలక సంస్థ విఫలం అయింది. పాలక ప్రజా ప్రతినిధులు మొద్దు నిద్రలో ఉన్నారు.
మోడీ, జగన్ ప్రభుత్వాలు 24 గంటల నీటి పథకం పేరుతో నీటి మీటర్లు బిగించటానికి అత్యుత్సాహం చూపిస్తున్నారు తప్ఫ నీటి ఎద్దడిని అరికట్టడానికి దృష్టి సారించడం లేదు. మరోవైపు నగరంలో ఎండలు ముదురుతున్నా, దోమలు మాత్రం చెండాడుకు తింటున్నాయి. మురుగు కాలువల నిర్వహణ అధ్వాన్నంగా మారింది.
460 కోట్ల రూపాయల మురుగు కాలవల నిర్మాణానికి నిధులు కేటాయించినా డ్రైనేజీ వ్యవస్థ మెరుగుపడలేదు.దోమల నివారణకు పేదలతో సహా నగర ప్రజలందరూ ప్రతినెలా వందలాది రూపాయలు ఖర్చు పెట్టుకోవాల్సి వస్తోంది.
దోమలను అరికట్టలేని నేతలు నగరాభివృద్ధి గురించి ప్రగల్బాలు పలకటం శోచనీయం. ఆస్తి పన్నులు పెంచడం, ఏనాడు లేని చెత్తపన్ను ప్రజలపై రుద్దటం, డ్రైనేజీ, మంచినీటి చార్జీలు ప్రతి సంవత్సరం పెంచడం తప్ప పాలకులు చేసిందేమీ లేదు.
చెత్తపన్ను మోపిన బిజెపి, వైసిపి ప్రభుత్వాలకు బుద్ధి చెప్పండి. బిజెపితో జతకట్టిన తెలుగుదేశం పార్టీని తిరస్కరించండి. చెత్తపన్నుకు వ్యతిరేకంగా పోరాడుతున్న సి.పి.ఎం.ను ఎన్నికల్లో బలపరచి, గెలిపించాలని బాబు రావు కోరారు.
నేడు జరిగిన పాదయాత్రలో సి.పి.ఎం నాయకులు స్థానిక పెద్దలు బి.రమణ రావు, కే దుర్గారావు, బి.రూబెన్, ఎస్.కె.రసూల్, ఎస్.కె. రషీద్, బెంజిమెన్, ఎ.పున్నారావు, పి.ఎస్.ఎన్.మూర్తి,ఎస్.కె. నిజాముద్దీన్, వెంకటేశ్వరరావు, నాగార్జున, తదితరులు పాల్గొన్నారు