MLA Kolikapudi : రోడ్డుపై గుంతల్లో నీరు.. ఎమ్మెల్యే కొలికపూడి నిరసన

MLA Kolikapudi
MLA Kolikapudi : ఆర్ అండ్ బీ అధికారుల తీరుపై నిరసనగా ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు రోడ్డుపై గుంతలో స్టూల్ వేసుకుని బైఠాయించారు. మున్సిపల్ కార్యాలయం సమీపంలో గుంతలను పూడ్చడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఫలితంగా చిన్నపాటి వర్షానికే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్ల మరమ్మతులపై అధికారుల తీరును నిరసిస్తూ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస రావు గుంతల్లో నిలిచిన నీటిలో కుర్చీ వేసుకుని బైఠాయించారు. సుమారు గంట సేపటి వరకు ఆర్ అండ్ బీ అధికారుల కోసం నిరీక్షించారు.
విషయం తెలుసుకున్న ఆర్ అండ్ బీ ఏఈ గాయత్రి వచ్చారు. రహదారి అభివృద్ధికి ప్రభుత్వం రూ.1.96 కోట్లు మంజూరు చేసిందని, టెండరు పూర్తిచేసి కాంట్రాక్టర్ కు వర్క్ ఆర్డర్ ను జనవరిలో ఇచ్చామని ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు. తరువాత ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులోకి రావడంతో రహదారి అభివృద్ధి నిలిచిందని, వర్షాకాలం తర్వాత పనులు ప్రారంభిస్తామని బదులిచ్చారు. కనీసం గుంతల వరకైనా సత్వరం మరమ్మతు చేయాలని ఏఈకి సూచించి ఎమ్మెల్యే నిరసన విరమించారు.