Ratan Tata : కార్పొరేట్ దిగ్గజం, ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా అంత్యక్రియలు గురువారం సాయంత్రం 4 గంటలకు ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటలకు చివరి దర్శనం కోసం నారిమన్ మైదానంలోని ఎన్‌సీపీఏ లాన్‌లో ఆయన భౌతికకాయాన్ని ఉంచుతారు. రతన్ టాటా బుధవారం రాత్రి 11.30 గంటలకు ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో 86 ఏళ్ల వయసులో తుది శ్వాస విడిచారు. అయితే అంత్యక్రియల విషయంలో భిన్న చర్చలు జరుగుతున్నాయి. రతన్ టాటాది పార్సీ కమ్యూనిటీ. కానీ అంత్యక్రియలు హిందూ సంప్రదాయాల ప్రకారం నిర్వహించనున్నట్లు తెలుస్తున్నది. సాయంత్రం 4 గంటలకు ముంబైలోని వర్లీలో గల విద్యుత్ శ్మశానవాటికలో ఆయన భౌతికకాయాన్ని ఉంచనున్నారు. ఇక్కడ దాదాపు 45 నిమిషాల పాటు ప్రార్థనలు చేస్తారు. ఆ తర్వాత అంత్యక్రియల ప్రక్రియ పూర్తవుతుంది.
భిన్నంగా పార్సీ కమ్యూనిటీ అంత్యక్రియల పద్ధతి
పార్సీ కమ్యూనిటీలో అంత్యక్రియల నియమాలు చాలా భిన్నంగా ఉంటాయి. పార్సీలలో అంత్యక్రియల సంప్రదాయం 3 వేల సంవత్సరాల క్రితం నాటి పద్ధతులే ఇప్పటికీ పాటిస్తుంటారు. వేల సంవత్సరాల క్రితం పర్షియా (ఇరాన్) నుంచి భారతదేశానికి వచ్చిన పార్సీ సమాజంలో, మృతదేహాన్ని దహనం లేదా ఖననం చేయరు. జొరాస్ట్రియనిజంలో, మరణం తర్వాత, శరీరాన్ని రాబందులు తినడానికి బహిరంగ ప్రదేశంలో ఉంచుతారు. దీనిని టవర్ ఆఫ్ సైలెన్స్ లేదా దఖ్మా అని పిలుస్తారు. రాబందులు మృత దేహాలను తినడం కూడా పార్సీ సమాజ సంప్రదాయంలో ఒక భాగం. అయితే రతన్ టాటా అంత్యక్రియలు హిందూ సంప్రదాయం ప్రకారం జరగనున్నాయి. సెప్టెంబర్ 2022లో, టాటా సన్స్ మాజీ ఛైర్మన్ సైరస్ మిస్త్రీ అంత్యక్రియలు కూడా హిందూ ఆచారాల ప్రకారం జరిగాయి. ఎందుకంటే కరోనా మహమ్మారి సమయంలో మృతదేహాలను దహనం చేసే పద్ధతుల్లో మార్పులు వచ్చాయి. ఆ సమయంలో పార్సీ సమాజం పాటించే అంత్యక్రియల ఆచారాలను నిషేధించారు.
పార్సీలు అంత్యక్రియలు ఎలా చేస్తారు?
పార్సీ కమ్యూనిటీకి చెందిన వ్యక్తి మరణించిన తర్వాత, మృతదేహాన్ని జనావాసాలకు దూరంగా దఖ్మా అంటే టవర్ ఆఫ్ సైలెన్స్‌కు తీసుకువెళతారు. చాలా చోట్ల అది చిన్న కొండ కూడా కావచ్చు. టవర్ ఆఫ్ సైలెన్స్‌లో మృతదేహాన్ని ఎత్తైన ప్రదేశంలో ఉంచుతారు. దీని తరువాత మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని చివరగా ప్రార్థనలు చేస్తారు. ప్రార్థనల అనంతరం మృతదేహాన్ని డేగలు, రాబంధుల వంటి పక్షులకు వదిలేస్తారు.
హిందూ ఆచారాలకు కారణం?
ఒకప్పుడు ప్రస్తుత ఇరాన్ అంటే పర్షియాలో జనాభా ఉన్న ఈ కమ్యూనిటీ ప్రజలు ఇప్పుడు మొత్తం ప్రపంచంలో చాలా తక్కువ సంఖ్యలో ఉన్నారు. 2021లో నిర్వహించిన సర్వే ప్రకారం, ప్రపంచంలో పార్సీల సంఖ్య 2 లక్షల కంటే తక్కువ. ప్రపంచవ్యాప్తంగా అంత్యక్రియల ప్రత్యేక సంప్రదాయం కారణంగా ఈ కమ్యూనిటీ చాలా ఇబ్బందులు ఎదుర్కొంటోంది. గత కొన్ని సంవత్సరాలుగా, టవర్ ఆఫ్ సైలెన్స్‌కు సరైన స్థలం లేకపోవడం ఒక కారణం అయితే, డేగలు రాబంధుల వంటి పక్షులు లేకపోవడం మరో కారణం. దీంతో పార్సీ ప్రజలు తమ అంత్యక్రియల ఆచారాల్లో కొంత మార్పులు చేసుకున్నారు.
పార్సీ కమ్యూనిటీకి చెందిన కైకోబాద్ రుస్తోమ్‌ఫ్రామ్ ఎప్పటినుండో తాను చనిపోతే, రాబందులు పార్సీ మత సంప్రదాయం ప్రకారం అతని మృతదేహాన్ని స్వీకరిస్తాయని భావించేవాడు. కానీ ఇప్పుడు ఈ పక్షి భారతదేశంలో అరుదుగా కనిపిస్తుంది. దీంతో పార్సీలు తమ పురాతన సంప్రదాయాలను అనుసరించడం చాలా కష్టంగా మారింది. ఇప్పుడు చాలా పార్సీ కుటుంబాల్లో ఎవరైనా చనిపోతే హిందూ సంప్రదాయాల ప్రకారం అంత్యక్రియలు జరిపిస్తున్నారు.