CM Jagan : ‘‘ఏపీ ప్రజలకు తాను చేస్తున్న మేలును ప్రతిపక్షాలు ఓర్వడం లేదు. తాను ఇస్తున్నా సంక్షేమం.. తాను చేస్తున్న అభివృద్ధితో జనాల హృదయాల్లో వారికి స్థానం ఉండదు.. ఇది పేదలకు, పెట్టుబడిదారులకు జరుగుతున్న యుద్ధం.. తనపై ఆ ముగ్గురూ కుట్రలు పన్నుతున్నారు’’ అని వైసీపీ అధినేత, సీఎం జగన్ ప్రతీ రోజూ ఆరోపిస్తూనే ఉంటారు. తన రాజకీయ ప్రత్యర్థులైన చంద్రబాబు, పవన్, లోకేశ్ తనపై కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నారని వారిపై వ్యక్తిగత దూషణలకు సైతం దిగుతుంటారు. అలా మాట్లాడే జగన్ కూడా కడిగిన ముత్యంలా ఉండాలని జనాలు ఆశించడం తప్పేం కాదు. ఆ ముగ్గురిని రాజకీయంగా దెబ్బతీయడానికి జగన్ చేయని ప్రయత్నమంటూ లేదనే చెప్పాలి.
టీడీపీ, జనసేన చేస్తే కుట్రలు, కుతంత్రాలు.. తాను చేస్తే మాత్రం రాజకీయ ‘వ్యూహం’.. అని చెపుతుంటారు. ఈ సినిమా ‘వ్యూహం’ కూడా అలాంటిదే. తన ప్రత్యర్థుల ప్రతిష్టను దెబ్బతీయడానికి ఆఖరికీ సినిమాలను కూడా వాడుకుంటున్నారు. వర్మకు డబ్బులివ్వడం ఏదో కాంట్రావర్సీ సినిమా తీయడం.. జనాలపైకి వదలడం.. ఇదే కదా చేస్తున్నది. తాజా ‘వ్యూహం’ అలాంటిదే. అయితే ఇది బెడిసికొట్టింది. చంద్రబాబు, లోకేశ్, పవన్ పరమ దుర్మార్గులు అన్నట్టు, కుట్రలు, కుతంత్రాలు చేసే దుష్టులన్నట్టు.. జగన్ హీరో అన్నట్టు ఈ మూవీని వర్మతో తీయించేశారు.
ఈ సినిమా ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్ లో కూడా అదే చూపారు. ఆ పాత్రలకు కూడా అచ్చంగా వారిని పోలిన ఆర్టిస్టులనే తీసుకున్నారు. వర్మ కూడా ఓపెన్ గానే ఆ పాత్రలు చంద్రబాబు, పవన్, లోకేశ్ అని చెప్పేశాడు. ఇంకా ఇందులో సోనియా, చిరంజీవి.. ఇలా పలువురు ప్రముఖులను కూడా ఈ కుట్రలో భాగమని చూపించారు.
తద్వారా వారంతా కుట్రదారులు, దుర్మార్గులని ప్రజల మెదళ్లలో చొప్పించడానికి ప్రయత్నించారు. అయితే ఈ చవకబారు ‘వ్యూహం’ విఫలమైంది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పిటిషన్ పై తెలంగాణ హైకోర్లు విచారణ చేసి సినిమాను జనవరి 11 వరకు విడుదల చేయవద్దని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
ఇక జగన్ అధికారంలో ఉండి సంక్షేమ పథకాల ప్రచారం కోసం వేల కోట్లు ఖర్చు చేస్తున్నారు. అలాగే చట్టబద్ధత లేని వలంటీర్ల ద్వారా వందల కోట్లు ఖర్చుచేస్తున్నారు. ఇక టీడీపీ, జనసేన పార్టీలను దెబ్బతీయడానికి కోట్లు పెట్టి సినిమాలు తీసి వారి వ్యక్తిగత గౌరవానికి భంగం కలిగిస్తున్నారు. ఎన్నికల్లో గెలవాలనుకుంటే ఏ పాలకుడైనా తాను చేసిన అభివృద్ధిని చూపించాలి..ప్రజలకెంత ఉపాధిని కల్పించామో చెప్పాలి.. నిరుద్యోగులకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చామో చెప్పాలి.. ఎన్ని ప్రాజెక్టులు కట్టామో చెప్పాలి.., తాగునీరు, కరెంట్ ఎలా అందిస్తున్నామో చెప్పాలి..మౌలిక సదుపాయల కల్పన ఎలా ఉందో చెప్పాలి.. అంతే కాని ప్రతిపక్షనేతలు తనపై కుట్ర చేస్తున్నారని పదే పదే చెప్పడం ఎందుకో ఎవరికీ అర్థం కాదు. కుట్రల వ్యూహాలు ఎవరివో జనం గమనిస్తూనే ఉన్నారు. ‘‘మనం ఎన్ని బటన్లు నొక్కామన్నది కాదు.. జనం ఏ బటన్ నొక్కబోతున్నారనేది’’ రేపటి ఎన్నికల్లో తేలిపోనుంది.