Nagababu : కూటమి పార్టీల మధ్య ఓట్ల బదిలీ జరుగుతుందా? నాగబాబు అంచనా ఇలా ఉంది!!

Nagababu

Nagababu

Nagababu : వచ్చే ఎన్నికల్లో వైసీపీని గద్దె దించడమే లక్ష్యంగా టీడీపీ, జనసేన, బీజేపీ కట్టిన విషయం తెలిసిందే. అయితే అందరి అనుమానం ఏంటంటే ఈ మూడు పార్టీల మధ్య ఓట్ల బదిలీ జరుగుతుందా? లేదా? అని. దీనికి కారణం గత ఎన్నికల్లో విడివిడిగా పోటీ చేసి ఈ మూడు పార్టీలు భారీగా నష్టపోవడమే. గతంలో 2014లో టీడీపీ, బీజేపీ కలిసి పోటీ చేసినా కాషాయ పార్టీకి సరైన ఓటు బ్యాంకు లేకపోవడంతో భారీ గెలుపు సాధ్యం కాలేదు. కానీ ఈసారి బీజేపీతో పోలిస్తే క్షేత్రస్థాయిలో బలమున్న జనసేన కలువడంతో ఓటు బ్యాంకు బదిలీపై చర్చ సాగుతోంది.

ఈ నేపథ్యంలో రాష్ట్రంలో జరిగే ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన మధ్య ఓట్ల బదిలీపై జనసేన సీనియర్ నేత కొణిదెల నాగబాబు తన మార్క్ విశ్లేషణ చేశారు. జనసేన, టీడీపీ, బీజేపీ మధ్య ఓటు బదిలీ వందశాతం జరుగుతుందని నొక్కి చెప్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వం అంటూ గతంలో ఇప్పటం సభలో పవన్ చేసిన ప్రకటన ప్రతిఫలాలు మనం ఇప్పుడు చూడబోతున్నామని నాగబాబు పేర్కొన్నారు.

పవన్ ఏ అంశం ప్రస్తావించినా, ఏ నిర్ణయం తీసుకున్నా అనతి కాలంలోనే అనూహ్య ఫలితాలు వస్తాయని నాగబాబు తెలిపారు. ఇప్పుడు విపక్షాల కూటమి విషయంలోనూ భారీ స్పందన వస్తోందన్నారు. జనసేన కార్యాలయంలో గత వారం రోజుల్లో 1000మంది కార్యకర్తలతో మాట్లాడనని, అంతా పవన్ నిర్ణయాన్ని శిరసావహిస్తామని, కూటమి అభ్యర్థులను గెలిపించుకుంటామని చెప్పారని నాగబాబు తెలిపారు.

అలాగే పొత్తు కారణంగా పోటీ చేసే అవకాశం రాని పలువురు ఆశావహులను కూడా కేంద్ర కార్యాలయానికి పిలిచి ఒక్కొక్కరితో సుదీర్ఘంగా మాట్లాడుతున్నట్లు నాగబాబు తెలిపారు. ఈ దఫా మాకు అవకాశం రాకపోయినా ఫర్వాలేదు. వచ్చే ఎన్నికల వరకూ ఆగుతాం. కానీ ఇప్పుడు మాత్రం కూటమి అభ్యర్థులు గెలవాలి. దాని కోసం మా శాయశక్తులా కృషి చేస్తామని వారు చెప్తున్నారని నాగబాబు పేర్కొన్నారు.

TAGS