TS Elections:మ‌రి కొన్ని గంట‌ల్లో ఉత్కంఠ‌కు తెర‌..2,417 రౌండ్ల‌లో ఓట్ల లెక్కింపు

TS Elections:తెలంగాణ ఎన్నిక‌ల స‌మ‌రం ముగిసింది. కానీ ఫ‌లితాల విష‌యంలో మాత్రం తీవ్ర ఉత్కంఠ నెల‌కొంది. మ‌రి కొన్ని గంట‌ల్లో ఓట్ల లెక్కింపు ప్ర‌క్రియ ప్రారంభం కానున్న నేప‌థ్యంలో తెలుగు రాష్ట్రాల ప్ర‌జ‌లు ఎలాంటి ఫ‌లితాలు రానున్నాయో అని ఉత్కంఠ‌త‌తో ఎదురు చూస్తున్నారు. ఓట్ల లెక్కింపు ప్ర‌క్రియ నియోజ‌క వ‌ర్గాల వారిగా మ‌రి కొన్ని గంట‌ల్లో ప్రారంభం కాబోతోంది. మొత్తం 119 నియోజ‌క వ‌ర్గాల‌కు సంబంధించి 2,417 రౌండ్ల‌లో ఓట్ల లెక్కింపు జ‌రుగ‌నుంది.

ఒక్కో నియోజ‌క వ‌ర్గానికి 14 నుంచి 28 టేబుళ్లు ఏర్పాటు చేశారు. ఆదివారం ఉద‌యం 5 గంట‌ల‌కే పోలింగ్ సిబ్బంది, ఏజెంట్‌లు పోలింగ్ కేంద్రానికి చేరుకుంటారు. 8 గంట‌ల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభిస్తారు. ఇక పోస్ట‌ల్ బ్యాలెట్‌ల కోసం ప్ర‌త్యేక టేబుళ్లు ఏర్పాటు చేశారు. తొలి రౌండ్ నుంచే ఓట‌రు నాడి వెల్ల‌డ‌య్యే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. రౌండ్ రౌండ్‌కూ ఉత్కంఠ‌త రేపేలా ఫ‌లితాలు రానున్న‌ట్టుగా రాజ‌కీయ విశ్లేశ‌కులు భావిస్తున్నారు. పోలింగ్ బూత్‌ల ఆధారంగా లెక్కింపు ప్ర‌క్రియ ప్రారంభం కానుండ‌టంతో ఇప్ప‌టికే అభ్య‌ర్థులు త‌మ‌కు ఏ రౌండ్‌లో ఎలాంటి ఫ‌లితాలు వ‌స్తాయ‌నే లెక్క‌లు వేసుకుంటున్నారు.

తొలి ఫ‌లితం అక్క‌డి నుంచే?..

భ‌ద్రాచ‌లం నియోజ‌క వ‌ర్గంలో 1,17,447 ఓట్లు పోల‌య్యాయి. ఇక్క‌డ 14 టేబుళ్లు ఏర్పాటు చేసి 13 రౌండ్ల‌లో లెక్కింపు పూర్తి చేయ‌నున్నారు. రాష్ట్రంలో అత్యంత త‌క్కువ రౌండ్ల‌లో లెక్కింపు పూర్త‌య్యేది భ‌ద్రాచ‌లంలోనే. మ‌ధ్యాహ్నం 12 గంట‌ల్లోపు లెక్కింపు పూర్త‌వుతుంద‌ని అధికారులు అంచ‌నా వేస్తున్నారు. దీంతో ముందుగా భ‌ద్రాచ‌లం ఫ‌లితం వెలువ‌డే అవ‌కాశం ఉంద‌ని అంతా భావిస్తున్నారు. ఆ త‌రువాత అశ్వారావు పేట నియోజ‌క వ‌ర్గంలో 14 రౌండ్ల‌లో ఓట్ల లెక్కింపు పూర్తి కానుంది.

కామారెడ్డిలో 19, గ‌జ్వేల్‌లో 23 రౌండ్ల‌లో లెక్కింపు..

ఈ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో అంద‌రి దృష్టిని ఆక‌ర్షించిన నియోజ‌క వ‌ర్గాలు కామారెడ్డి, గ‌జ్వెల్‌. ఈ రెండు చోట్ల సీఎం కేసీఆర్ పోటీ చేయ‌డంతో ప్రాధాన్య‌త ఏర్ప‌డింది. కామారెడ్డిలో మొత్తం 2,52,460 ఓట్లు ఉండ‌గా, 1,93,811 ఓట్లు పోల‌య్యాయి. ఇక్క‌డ 14 టేబుళ్ల‌లో మొత్తం 19 రౌండ్లలో ఓట్ల లెక్కింపు చేప‌ట్టనున్నారు. గ‌జ్వేల్‌లో మొత్తం 2,74,654 ఓట్లు ఉండ‌గా..2,31,086 ఓట్లు పోల‌య్యాయి. ఇక్క‌డ ఓట్ల లెక్కింపు కోసం 14 టేబుళ్లు ఏర్పాటు చేశారు. 23 రౌండ్ల‌లో ఓట్ల లెక్కింపు పూర్తి కానుంది.

టీపీసీసీ అధ్య‌క్షుడు రేవంత్‌రెడ్డి పోటీ చేసిన కొడంగ‌ల్ నియోజ‌క వ‌ర్గంలో మొత్తం 2,36,625 ఓట్లున్నాయి. అందులో 1,93,940 ఓట్లు మాత్ర‌మే పోల‌య్యాయి. కొడంగ‌ల్‌లో 14 టేబుళ్ల ద్వారా 20 రౌండ్ల‌లో లెక్కింపు పూర్తి చేయ‌నున్నారు. ఓట‌ర్లు ఎక్కువ‌గా ఉన్న ఎల్బీన‌గ‌ర్‌, శేరిలింగంప‌ల్లి, కుత్బుల్లాపూర్, మేడ్చ‌ల్‌, మ‌హేశ్వ‌రం, రాజేంద్ర‌న‌గ‌ర్ నియోజ‌క వ‌ర్గాల్లో 28 చొప్పున టేబుళ్లు ఏర్పాటు చేశారు.

TAGS