Vizag for Sale : ఉర్సా క్లస్టర్స్ కు భూకేటాయింపుల వ్యవహారంలో విజయవాడ ఎంపీ కేశినేని నాని తన సోదరుడు కేశినేని చిన్నిపై ఆరోపణలు చేశారు. సదరు సంస్థ ప్రమోటర్లలో ఒకరు కేశినేని చిన్ని క్లాస్ మేట్ అని నాని ఆరోపించారు.
ఈ ఆరోపణలపై నిన్న జూమ్ కాల్ లో స్పందించిన ఆ ప్రమోటర్, కేశినేని చిన్ని తనకు క్లాస్ మేట్ కాదని, సీనియర్ అని స్పష్టం చేశారు. అదే సమయంలో నాని చేసిన ఆరోపణలపై కేశినేని చిన్ని తీవ్రంగా స్పందిస్తూ, నానిని ఉద్దేశించి “సైకో” అంటూ వ్యాఖ్యానించారు.
దీనిపై ఇవాళ కేశినేని నాని తిరిగి స్పందించారు. ఎవరు ఎన్ని జూమ్ మీటింగులు పెట్టి వివరణలు ఇచ్చినా, తనను ఎవరు ఎన్ని బూతులు తిట్టినా – “చిప్ దో” అన్నా, “సైకో” అన్నా తనకు ఎలాంటి ఇబ్బంది లేదని పేర్కొన్నారు. అయితే ఒకటి మాత్రం ఖాయమని, “వైజాగ్ ఈజ్ ఫర్ సేల్” అంటూ తన సోదరుడి వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. అంతేకాకుండా, ఈ డీల్ కు సంబంధించిన పత్రాలున్న ఓ వెబ్ సైట్ వివరాలను తన ఫేస్ బుక్ పోస్ట్ కు నాని జత చేశారు. తద్వారా, ఎవరేమనుకున్నా విశాఖపట్నాన్ని అమ్మకానికి పెట్టేశారని ఆయన ఆరోపణలు గుప్పించారు.
కేశినేని నాని వ్యాఖ్యలపై కేశినేని చిన్ని ఎలా స్పందిస్తారో చూడాలి మరి.