JAISW News Telugu

Varun Tej:మెగా హీరో కోసం హైద‌రాబాద్‌లో వైజాగ్ సిటీ!

Varun Tej:ఇంత‌కుముందు ఓ సినిమా కోసం హైద‌రాబాద్‌లో బీచ్ సెట్ వేయ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. కేవ‌లం బీచ్ సెట్ మాత్ర‌మే కాదు.. ఏకంగా న‌గ‌రాల‌నే సెట్ల‌లో నిర్మిస్తుండ‌డం ఇటీవ‌లి ట్రెండ్. ఇప్పుడు హైద‌రాబాద్ లో వైజాగ్ న‌గ‌రాన్ని రీక్రియేట్ చేయ‌డం హాట్ టాపిక్ గా మారింది. బీచ్ సొగ‌సుల విశాఖ‌ సిటీని హైద‌రాబాద్ లో రీక్రియేట్ చేయ‌డం ఆస‌క్తిని క‌లిగిస్తోంది. వరుణ్ తేజ్ న‌టిస్తున్న మట్కా కోసం ఈ ప్ర‌య‌త్నం. ఈ చిత్రానికి పలాస ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు.

మెగా హీరో కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న చిత్రమిది. మట్కా వైజాగ్ సిటీ బ్యాక్‌డ్రాప్‌తో 1960ల నాటి నేపథ్యంలో తెరకెక్కుతోంది. నాటి విశాఖ‌ను రీక్రియేట్ చేసేందుకు మేకర్స్ చాలా కష్టపడుతున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో పాతకాలపు వైజాగ్‌ సెట్‌ని నిర్మిస్తున్నారు. పాతకాలపు వైజాగ్ ని య‌థాత‌థంగా హైద‌రాబాద్ న‌గ‌రంలోని సెట్లో రీక్రియేట్ చేయ‌డం కోసం కంప్యూటర్ గ్రాఫిక్స్ ని, డిజిటల్ మ్యాట్ పెయింటింగ్స్ ని ఉప‌యోగిస్తున్నార‌ని తెలిసింది.

ఇక ఈ సెట్ నిర్మాణం కోసం చాలా మంది టెక్నీషియ‌న్లు రోజుల త‌ర‌బ‌డి ప‌ని చేయాల్సి ఉంద‌ని కూడా తెలుస్తోంది. అద్భుత‌మైన‌ కథతో పాటు ప్రొడక్షన్ డిజైన్ ప‌రంగా జాగ్ర‌త్త‌ల‌తో మట్కా రూపంలో భారీ హిట్ కొట్టాల‌నే ప్ర‌య‌త్నం క‌నిపిస్తోంది. వ‌రుణ్ తేజ్ ఈ చిత్రం కోసం చాలా శ్ర‌మిస్తున్నార‌ని కూడా వెల్ల‌డైంది. వరుణ్ తేజ్ మునుపెన్నడూ చూడని లుక్‌లో కనిపించనున్నాడు. మొత్తం నాలుగు విభిన్న గెటప్‌లలో కనిపించనున్నాడు.

నోరా ఫతేహి కీలక పాత్రలో నటిస్తుండగా, వరుణ్ తేజ్ సరసన మీనాక్షి చౌదరి కథానాయికగా నటించింది. ఈ చిత్రంలో నవీన్ చంద్ర, కన్నడ కిషోర్ కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు. వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై మోహన్ చెరుకూరి, డా. విజయేందర్ రెడ్డి తీగల భారీ ఎత్తున నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: జి.వి.ప్రకాష్ కుమార్, ఛాయాగ్రహణం: ప్రియాసేథ్‌. ఇదిలా ఉంటే మ‌ట్కా మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ గురువారం హైద‌రాబాద్‌లో మొద‌లైంది.

Exit mobile version