Bhupathiraju Srinivasavarma : విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు..: కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ
Bhupathiraju Srinivasavarma : విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అన్న సెంటిమెంట్ దెబ్బతినకుండా ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆలోచనలకు అనుగుణంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ పై ఏ విధంగా ముందుకెళ్లాలన్న దానిపై ఆలోచిస్తామని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయమంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ తెలిపారు. ఆయన మంగళవారం ఢిల్లీ ఉద్యోగ్ భవన్ లోని ఉక్కు, భారీ పరిశ్రమల మంత్రిత్వశాఖలో బాధ్యతలు చేపట్టిన సందర్భంగా విలేకర్లతో మాట్లాడారు.
ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా కొత్తగా పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు వచ్చేవారిని, సంస్థలను ప్రోత్సహిస్తాం. ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన పరిశ్రమల విషయంలో సీఎం చంద్రబాబుతో సమావేశమై చర్చిస్తామని తెలిపారు. ఐదేళ్లలో ఏపీకి కొత్త పరిశ్రమలు రాకపోగా, ఉన్నవి ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోయాయని, అలాంటి సంస్థలను పిలిచి మాట్లాడి తిరిగి రాష్ట్రంలో పరిశ్రమలు నెలకొల్పేలా చూస్తామని అన్నారు. పరిశ్రమల ఏర్పాటుకున్న నిబంధనలను సరళతరం చేయడంతో పాటు భూములు కేటాయించి త్వరగా అన్ని అనుమతులూ మంజూరయ్యేలా చూస్తామని, ఏపీ అభివృద్ధిలో నావంతు పాత్ర పోషిస్తానని పేర్కొన్నారు.
విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ గురించి విలేకరుల ప్రశ్నలకు బదులిస్తూ.. ప్రైవేటీకరణ అన్నది కేవలం ఆ కర్మాగారానికి మాత్రమే ఉద్దేశించి తీసుకున్న నిర్ణయం కాదని అన్నారు. ‘నాన్ స్ట్రాటజిక్ ప్రభుత్వరంగ సంస్థల్లో పెట్టుబడులను ఉపసంహరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగానే వైజాగ్ స్టీల్ ప్రైవేటీకరణ అంశం తెరపైకి వచ్చింది తప్పితే ప్రత్యేకంగా ఈ స్టీల్ ప్లాంట్ ను ఉద్దేశించి తీసుకున్న నిర్ణయం కాదు. దీనిపై గతంలో పార్టీ నాయకులుగా మేం జాతీయ, రాష్ట్ర నాయకత్వానికి విన్నపాలిచ్చాం. ప్రస్తుతం మేం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తో కలిసి ఎన్డీయే కూటమిగా అధికారంలో ఉన్నాం. దీనిపైన వారిద్దరితో పాటు కేంద్రంలో ఉన్న తెలుగు మంత్రులం అంతా కలిసి త్వరలో ప్రధాని, ఆర్థిక మంత్రితో మాట్లాడతాం. కార్మికుల భద్రతకు సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం హామీనిచ్చింది. విశాఖ స్టీల్ కు కేప్టివ్ మైన్స్ కేటాయింపుపై నేను కేంద్ర బొగ్గు, గనుల శాఖ కిషన్ రెడ్డితో మాట్లాడతా. రాబోయే రోజుల్లో దీనిపై క్షుణ్ణంగా ఆలోచిస్తాం’ అని శ్రీనివాసవర్మ పేర్కొన్నారు.