Viral Video : టీడీపీ అధికారంలోకి వస్తే పూర్తి చేస్తామని హామీ ఇచ్చిన ప్రాజెక్టులలో పోలవరం ఒకటి. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయగానే ఆ ప్రాజెక్టు పరిశీలనకు వెళ్లారు. ఈ రోజు కూడా పోలవరం ప్రాజెక్టును నిపుణుల బృందం పరిశీలిస్తోంది. ఈ క్రమంలోనే సోమవారం పోలవరం ప్రాజెక్టుపై విడుదల చేసిన శ్వేతపత్రంలో ప్రాజెక్టు ఎప్పుడు పూర్తిచేస్తారన్న ప్రశ్నకు సమాధానం ఇవ్వలేదని ఏపీ సీఎం చంద్రబాబును ఓ మహిళ ప్రశ్నించింది. రాష్ట్రంలో ప్రభుత్వం నిర్వహిస్తున్న పెన్షన్ పండుగలో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ తో కలిసి పలువురు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతుండగా ఓ మహిళ లేచి పోలవరం గురించి శ్వేత పత్రం విడుదల చేసిన మీరు .. ఎప్పుడు పూర్తి చేస్తారో శ్వేత పత్రంలో పేర్కొన లేదని ప్రశ్నించింది. దీనికి సీఎం చంద్రబాబు వివరణాత్మకమైన సమాధానం ఇచ్చారు. పోలవరం ప్రాజెక్టు గురించి ఏపీ ప్రజలు తెలుసుకోవాలని, చాలా మంచి ప్రశ్న వేశావని ఆ మహిళను చంద్రబాబు మెచ్చుకున్నారు.
పోలవరం ప్రాజెక్టుపై సీఎం చంద్రబాబు వివరణ ఇస్తూ.. ఓ దుర్మార్గుడు తన దుర్మార్గపు ఆలోచనలతో, నిపుణులు చెప్పిన మాటలను పెడచెవిన పెట్టి పనిచేస్తే ఎలా ఉంటుందనే దానికి నిదర్శనంగా పోలవరం ప్రాజెక్టు మిగిలిపోయిందన్నారు. గత ప్రభుత్వ నిర్వాకంతో ప్రాజెక్టుకు ఇప్పటి వరకు భారీ నష్టం జరిగిందన్నారు. అది దాదాపు రూ. 70 వేల కోట్లుగా నిపుణులు లెక్కించారని తెలిపారు. ఇది లక్ష కోట్లకు చేరినా ఆశ్చర్యం లేదన్నారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో ఏం చేయాలో తమకే అర్థం కావడంలేదని ఇంజినీరింగ్ నిపుణులు చెబుతున్నారని పేర్కొన్నారు.
ప్రస్తుతం ఈ ప్రాజెక్టు విషయంలో ఏంచేయాలనేదానిపై అమెరికా, కెనడా ఇంజినీర్లను రప్పించి, వారితో చర్చిస్తున్నామని చంద్రబాబు తెలిపారు. గతంలో తాము అధికారంలో ఉన్నపుడు రెండు సీజన్లలో ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి డయాఫ్రాం వాల్ నిర్మించామని చెప్పుకొచ్చారు. ఆ తర్వాత స్పిల్ వే కట్టామని, కాఫర్ డ్యాంలు కూడా పూర్తిచేశామన్నారు. మే లో అధికారం కోల్పోవడంతో డయాఫ్రాం వాల్ పూర్తిచేయలేకపోయామని, ఈ లోపు జగన్ సర్కారు అధికారంలోకి వచ్చి కాంట్రాక్టర్ ను మార్చేశారని చెప్పుకొచ్చారు. రెండేళ్లు ప్రాజెక్టును వదిలేయడంతో వరదలకు డయాఫ్రాం వాల్ దెబ్బతిందని చెప్పారు. కాఫర్ డ్యాంలు కూడా దెబ్బతిన్నాయన్నారు. ఇది టెక్నికల్ ఈష్యూ అయిన ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరముందన్నారు. ఈ వీడియోను తెలుగుదేశం పార్టీ తన సోషల్ మీడియాలో పోస్టు చేయగా తెగ వైరల్ అవుతోంది.