Viral News : ఇదెక్కిడి వింత.. ఆలయంలో పాలు తాగుతున్న పోచమ్మతల్లీ
Viral News : హైదరాబాద్ లో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. భక్తులు ఎంతో ఇష్టంగా సమర్పించిన పాలను పోచమ్మతల్లి తాగుతున్న అరుదైన ఘటన శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని మదీనాగూడలో చోటుచేసుకుంది. మదీనాగూడలో పోచమ్మ అమ్మవారి ఆలయం ఉంది. స్వయంభూగా వెలసిన అమ్మవారికి ఇక్కడి స్థానికులు నిత్యపూజలు చేస్తున్నారు. అమ్మవారి ఆలయంలో మహిమాన్వితమైన వింత ఘటనతో ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఆలయానికి వచ్చిన భక్తులు ప్రసాదంగా సమర్పించిన పాలను తాగడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.
అమ్మవారు నిజస్వరూపంగా భావించి ఆమెను దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. దీంతో ఆలయం మొత్తం పోచమ్మతల్లి నామస్మరణతో మార్మోగిపోయింది. గత మూడు రోజులుగా అమ్మవారు భక్తులు సమర్పించిన పాలు తాగుతున్నట్లు ఆలయ పూజారి నవీన్ కుమార్ తెలిపారు. దీంతో ఈ మూడు రోజులు ఆలయానికి వచ్చే భక్తులు సంఖ్య అనూహ్యంగా పెరిగింది. చెంచాలతో పాలు తీసుకుని అమ్మవారి నోటి వద్ద ఉంచితే వాటిని ఆమె తాగుతున్నట్లు చెబుతున్నారు.
ఆలయ పూజారి నవీన్ ఆ వింత ఘటన గురించి గత మూడు రోజుల క్రితం కమిటీకి తెలుపగా వారు కూడా అమ్మవారికి పాలను నైవేధ్యంగా సమర్పించినట్లు తెలిపారు. శుక్రవారం అమ్మవారికి చాలా పవిత్రమైన రోజుగా భావిస్తారు. ఈ క్రమంలోనే ఇలాంటి ఆశ్చర్యకరమైన ఘటన చోటు చేసుకోవడంతో అమ్మవారిపట్ల మరింత భక్తిభావంతో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. తమ కొరికలను తీర్చాలంటూ మొక్కుతున్నారు.
అయితే ఈ విషయాన్ని హేతువాదులు, నిపుణులు మాత్రం కొట్టిపారేస్తున్నారు. గతంలో కూడా వినాయకుడు పాలు తాగాడని, సాయిబాబా కళ్లు తెరిచాడని ప్రచారం జరిగాయని, ఇవన్నీ ఉత్తుత్తి ప్రచారాలే అని అన్నారు. రాయి పాలు తాగడమంటే శిలల్లో కొన్ని రసాయన ప్రక్రియలు, వేడిమి వల్ల పాలను, నీళ్లను రాళ్లు గ్రహించుకుంటాయని.. అంతే తప్ప దేవుడి విగ్రహాలు పాలు తాగుతాయన్నది మూఢనమ్మకమేనన్నారు.