AP Elections 2024 : ఏపీలో మరో నాలుగు రోజుల్లో ఎన్నికలు జరుగనున్నాయి. రేపటితో ప్రచారానికి తెరపడనుంది. దీంతో అన్ని రాజకీయ పార్టీలు ప్రచారం ముమ్మరం చేశాయి. ఈ ఎన్నికల్లో ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవాలని ప్రతిపక్షాలు తహతహలాడుతున్నాయి. వైసీపీని గద్దె దించాలని ఉన్న శక్తినంతా కూడగడుతున్నాయి. ఈ క్రమంలోనే 2014లో కూటమిగా మారిన టీడీపీ, బీజేపీ, జనసేనలు మరో సారి చేతులు కలిపాయి. 2014లో ఏకతాటిపై ఉండి కూటమి విజయం సాధించింది. మరోసారి ఘన విజయం సాధించేదిశగా ముందుకెళ్తున్నాయి.
మూడు పార్టీల పొత్తు కుదిరినప్పుడు పార్టీల మధ్య ఓట్ల బదలాయింపు జరుగుతుందా అనే సందేహాలు వచ్చాయి. దీనికి తగ్గట్టుగా వైసీపీకి విమర్శలు చేసేది. కానీ గత పది రోజుల్లో సీన్ మారిపోయింది. మోదీ, అమిత్ షా సభలతో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. బీజేపీకి ఓట్ల శాతం స్వల్పమే.. అయినా కూడా టీడీపీ, జనసేన దూకుడుకు కేంద్రంలో బలంగా ఉన్న బీజేపీ తోడు రావడం పెద్ద బోనస్ గా మారింది. మోదీకి ఉన్న జనాకర్షణ కూడా కూటమికి హెల్ప్ కానుంది.
ఇప్పటికే ఆంధ్రాలో చంద్రబాబు, పవన్ లకు సమ్మోహన శక్తి మాములుగా ఉండదు. పార్టీ క్యాడర్ వారంటే ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధపడుతారు. వీరికి తోడు మోదీ కలిసి రావడంతో వైసీపీ అభ్యర్థులకు నిద్ర కరువైపోయింది. మొన్నటిదాక 175 సీట్లు సాధిస్తామని ప్రగాల్భాలు పలికిన జగన్ కు నిన్నటి విజయవాడ రోడ్ షో చూశాక మైండ్ బ్లాంక్ అయిపోయి ఉంటుంది. మోదీ, చంద్రబాబు, పవన్ ఒకే వేదికపై చూస్తూ జనాల గుండెలు ఉప్పొంగిపోతున్నాయి. ఇక మూడు పార్టీల క్యాడర్ లో ఎక్కడా లేని జోష్ వస్తోంది. రాబోయే ఎన్నికల్లో కూటమికి 140+ సీట్లు రావడం పక్కా అనే నమ్మకం అందరిలో కలిగింది. ఇప్పటికే జగన్ ఒంటరి అయిపోయారు. ఆయన పార్టీలో ఎటు చూసినా నిస్తేజమే కనిపిస్తోంది.
మంత్రులు తమ నియోజకవర్గాలు దాటి బయటకు రావడం లేదు. ఓటమి భయంతో ఎక్కడివారు అక్కడే ప్రచారం చేసుకుంటున్నారు. జగన్ ఒక్కడే అపసొపాలు పడుతూ ప్రచారం చేస్తున్నా ఆయనలో గెలుస్తామన్న కాన్ఫిడెన్స్ అసలే కనపడడం లేదు. మొన్నటిదాక ఏపీపై మోదీ పెద్దగా దృష్టి పెట్టరు అనుకున్న జగన్ కు ఆయన స్పీచ్ లతో ఫీజులు ఎగిరిపోతున్నాయి. ‘‘వికసిత ఆంధ్రా..వికసిత భారత్..’’ అంటూ ముగ్గురు నేతల నినాదాలు విజయ వచనాలు అవుతున్నాయి. ఓ పక్క చంద్రబాబు, మరో పక్క పవన్ విజయ విహారం చేస్తుంటే జగన్ ముచ్చెమటలు పడుతున్నాయి. కూటమికి జనాలు జయహో..జయహో అంటూ స్వాగతం పలుకుతున్నారు. విజయీభవ..దిగ్విజయీభవ అంటూ దీవెనలు అందిస్తున్నారు.