CM Chandrababu : వికసిత్ ఆంధ్రప్రదేశ్-2047 విజన్ డాక్యుమెంట్.. పేదల జీవితాలు మారాలన్న సీఎం సీబీఎన్
CM Chandrababu : రాష్ట్ర ప్రభుత్వం వికసిత్ ఆంధ్రప్రదేశ్-2047 కోసం విజన్ డాక్యుమెంట్ రూపకల్పనను ప్రారంభించనుంది. సచివాలయంలో నీతి ఆయోగ్ సీఈవో బీవీఆర్ సుబ్రహ్మణ్యం, ప్రతినిధులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారు. వికసిత్ ఇండియా-2047 కోసం ప్రణాళికను సిద్ధం చేస్తున్నందున, ఆంధ్రప్రదేశ్-2047 కోసం విజన్ డాక్యుమెంట్ తయారీపై నీతి ఆయోగ్‌తో వికసిత్ చర్చించారు. వికసిత్ ఆంధ్రప్రదేశ్ 2047 విజన్ ప్లాన్‌పై నీతి ఆయోగ్ సీఈవో, ప్రతినిధులు, నిపుణులతో సీఎం సమావేశం నిర్వహించారు. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి చేపట్టాల్సిన కార్యక్రమాలు, ప్రాజెక్టులపై సమావేశంలో చర్చించారు.
ఈ సమావేశంలో ముఖ్యమంత్రి తన గత అనుభవాలు, నిర్ణయాలు, వాటి ఫలితాలు, భవిష్యత్తు ఆలోచనలను నీతి ఆయోగ్‌తో పంచుకున్నారు. దేశాభివృద్ధిలో తమ వంతు పాత్ర పోషించేందుకు ప్రత్యేక ప్రణాళికలతో పనిచేస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. ప్రభుత్వాలు దార్శనికతతో పనిచేయాలని, సమైక్య రాష్ట్రంలో చేపట్టిన సంస్కరణలు, దార్శనికతతో మంచి ఫలితాలు వచ్చాయని, నేడు వికసిత్ ఆంధ్రప్రదేశ్ కోసం విజన్ 2047ను సిద్ధం చేసి ప్రయాణం కొనసాగించాలన్నారు. వినూత్న ఆలోచనలు, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి పేదరికం లేని సమాజాన్ని సాధించాలని, అందుకు అనుగుణంగా వికసిత్ ఆంధ్రప్రదేశ్ విజన్-2047ను సిద్ధం చేయాలని సూచించారు.
రానున్న రోజుల్లో అమరావతి, వైజాగ్‌లను అన్ని రంగాల్లో కృత్రిమ మేథస్సుతో కూడిన ఏఐ హబ్‌లుగా మార్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని చంద్రబాబు సూచించారు. రాష్ట్రంలో ఏఐ యూనివర్సిటీ ఏర్పాటుకు ఆలోచిస్తున్నామని, ఫలాలు ప్రతి సామాన్యుడికి అందాలని, రాష్ట్ర స్థాయి నుంచి మండల, కుటుంబ స్థాయి వరకు యూనిట్ గా ప్రణాళికలు రూపొందించాలని, అప్పుడే విజన్ డాక్యుమెంట్ కు సార్థకత ఉంటుందన్నారు. వ్యవసాయ రంగంలో కొత్త ఆవిష్కరణలు తీసుకురావడమే కాకుండా ప్రకృతి ఆధారిత వ్యవసాయాన్ని ప్రోత్సహించేలా విధానాలు ఉండాలని సీఎం అన్నారు. సీమలో హార్టికల్చర్ ఆధారిత ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు వస్తే రైతులకు మేలు జరుగుతుంది. రాష్ట్ర ప్రగతికి కీలకమైన విద్యుత్ శాఖలో అనూహ్య మార్పులు రానున్నాయని, అందుకు అనుగుణంగా వ్యవస్థలు, ప్రజలు సిద్ధం కావాలన్నారు. 15 శాతం వృద్ధిరేటు లక్ష్యంగా ప్రభుత్వం పని చేయాలని చంద్రబాబు అన్నారు. 15 శాతం వృద్ధిరేటు సాధించడం ద్వారా ప్రజల తలసరి ఆదాయం రెట్టింపు అవుతుందని, తద్వారా వారి జీవన ప్రమాణాలు మెరుగుపడతాయన్నారు.