Vijayasai Targeted : పురందేశ్వరిని టార్గెట్ చేసిన విజయసాయి.. వరుస ట్వీట్లతో విమర్శల దాడి

Vijayasai Targeted Purandeswari
Vijayasai Targeted Purandeswari : వైసీపీలో కీలక నేతగా ఉన్న విజయసాయిరెడ్డి ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరిని టార్గెట్ చేశారు. ఆమెపై వరుస ట్వీట్లతో విరుచుకుపడుతున్నారు. ఇటీవల ఆమెపై వ్యక్తిగతంగా మాట్లాడిన విజయసాయిపై పురందేశ్వరి ఫైర్ అయ్యారు. ఆయన అక్రమాలను ప్రశ్నిస్తుంటే, బెదిరింపులకు దిగుతున్నారని ఆయనపై ఉన్న కేసుల విషయంలో దర్యాప్తు సంస్థలు, కోర్టుల తాత్సారం పై ఆమె ఏకంగా సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ కు లేఖ రాశారు.
ఇక ఇప్పుడు విజయసాయి, పురందేశ్వరిల మధ్య వార్ కొనసాగుతూనే ఉంది. తాజాగా మరో రెండు ట్వీట్లు చేశారు. తెలంగాణ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయొద్దని చెప్పింది పురందేశ్వరినేనని, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అక్కడ తమ ఆస్తులను కాపాడుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఒక ట్వీట్ చేశారు. బీజేపీ నేతగా కాకుండా, వారి జాతినేతగాపురందేశ్వరి ప్రవర్తిస్తున్నారంటూ ఎద్దేవాచేశారు. ఇక ఇక్కడితో ఆగలేదు. మరో ట్వీట్ చేశారు.
ఎన్టీఆర్ పేరు ఓ జిల్లాకు పెట్టిన జగన్ ను తిట్టిపోస్తున్నదని, వెన్నుపోటు పొడిచిన చంద్రబాబును మాత్రం శిక్ష పడకుండా కాపాడుతున్నదని ట్వీట్ చేశారు. ఇక పురందేశ్వరిపై జాతీయ నాయకుల్లో అనుమానం పెంచేలా విజయసాయి ట్వీట్లు ఉంటున్నాయని ఆమె సన్నిహితులు చెబుతున్నారు. చంద్రబాబుకు చెబితేనే కాంగ్రెస్, బీజేపీల్లో పురందేశ్వరి చేరారని పరోక్షంగా ఆయన ఆరోపిస్తున్నారు. మరి పురందేశ్వరి, విజయసాయిల మధ్య ఈ వార్ ఎప్పటివరకు కొనసాగుతుందో మరి.
అయితే ఒక మహిళ అని చూడకుండా ఇలా విజయసాయి విరుచుకుపడడంపై మాత్రం పలువురు ఖండిస్తున్నారు. రాజకీయ వైరుధ్యాన్ని వ్యక్తిగతంగా తీసుకున్నట్లు కనిపిస్తున్నదని చెబుతున్నారు. ఏదేమైనా విజయసాయి ట్వీట్ల వర్షం పురందేశ్వరిని ఇబ్బంది పెడుతున్నట్లే కనిపిస్తున్నదని వైసీపీ శ్రేణులు చెబుతున్నాయి.