Vijayasai : ‘ఉండి’ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రఘురామ కృష్ణరాజు శాసనసభ డెప్యూటీ చైర్మన్ గా ఏకగ్రీవంగా ఎన్నికవడంతో సీఎం బాబు, స్పీకర్ అయ్యన్న పాత్రుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజుతో పాటు పలువురు ప్రభుత్వ పెద్దలు ఆనవాయితీ ప్రకారం ఆయనను సగౌరవంగా ఉప సభాపతి చైర్ లో కూర్చోబెట్టారు. అనంతరం అందరూ అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. నాడు జగన్ రఘు రామ రాజును ఏవిధంగా చిత్ర హింసలు పెట్టి అవమానించారో గుర్తు చేసుకున్నారు. రఘురామ కృష్ణరాజును తన నియోజకవర్గంలో అడుగుపెట్టనీయకుండా జగన్ అడ్డుకుంటే నేడు ఆయనే మీ ఎదుట అడుగుపెట్టేందుకు జంకుతున్నారన్నారు. ఇది దేవుడు రాసిన స్క్రిప్ట్ అన్నారు.
రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమాలా ఈ ఆర్ఆర్ఆర్ (రఘురామ కృష్ణరాజు) కూడా రికార్డు నిర్ణయాలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు నాయుడు కోరారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. జగన్ కర్మఫలం ఇలా ఉందన్నారు. ఆ ఒత్తిళ్లన్నీ తట్టుకొని ధైర్యంగా పోరాడాలని పవన్ కళ్యాణ్ ను అభినందించారు.
గమ్మత్తేంటంటే ఎవరిని చూసి జగన్ శాసనసభకు వచ్చేందుకు భయపడుతున్నాడో ఆ రఘురామ కృష్ణరాజు డిప్యూటీ స్పీకర్ గా ఎన్నికైనందుకు వైసీపి ఎంపీ, జగన్ రైట్ హ్యాండ్ విజయసాయి రెడ్డి అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేశారు. మరి ఈ విషయం జగన్‌కు ఇంకా తెలుసో లేదో? తెలిస్తే ఏం చేస్తారో?
ఏది ఏమైనా రఘురామ కృష్ణరాజు ఢిల్లీలో కూర్చున్నప్పుడే జగన్‌ను గడగడలాడించారు. ఇప్పుడు శాసనసభలో ఉప సభాపతిగా కూర్చున్నారు. జగన్ వస్తే విడిచి పెడతారా..? అందుకే ‘ప్రధాన ప్రతిపక్ష నాయకుడి హోదా’ మెలిక పెట్టి తప్పించుకున్నారేమో?