Vijay in Politics : కెరీర్ మొత్తం అయిపోయిన తర్వాత ఒక సినిమా నటుడు రాజకీయాల్లోకి రావాలి అనుకోవడం ఇది వరకు మనం చాలా సార్లు చూసాము. కానీ కెరీర్ పీక్ రేంజ్ లో ఉన్నప్పుడు రాజకీయాల్లోకి రావాలంటే చాలా ధైర్యం ఉండాలి. ఆ ధైర్యం చేసి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గతం లో ‘జనసేన’ పార్టీ ద్వారా జనాల ముందుకు వచ్చాడు. ఆయన లాగ నేటి తరం స్టార్ హీరోలలో ఎవ్వరూ ధైర్యం చెయ్యలేరు, పవన్ కల్యాణే లాస్ట్ అని అందరూ అనుకున్నారు.
కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ లాగానే తమిళ స్టార్ హీరో తలపతి విజయ్ రాజకీయ అరంగేట్రం చేసాడు. కాసేపటి క్రితమే ఆయన తన పేరు ని ‘తమిళగ వెట్రి కజగం’ గా ప్రకటించాడు. రాబొయ్యే పార్లమెంట్ ఎన్నికలలో మేము పోటీ చేయబోవడం లేదని, 2026 వ సంవత్సరం లో జరగబొయ్యే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయమని ఈ సందర్భంగా విజయ్ అధికారిక ప్రకటన చేసాడు.
ఇంకా ఆయన మాట్లాడుతూ ‘నాకు అమ్మానాన్న తర్వాత పేరు, ఫేమ్, పాపులారిటీ ఇచ్చింది తమిళ ప్రజలే. వాళ్ళ కోసం నా మిగిలిన జీవితాన్ని అంకితం చేస్తున్నాను. పూర్తి స్థాయిలో ప్రజాసేవ చెయ్యడమే నా లక్ష్యం. వచ్చే ఏడాది తో నేను సినిమాలను కూడా పూర్తిగా వదిలేస్తున్నాను’ అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం విజయ్ సినీ హీరోగా ఏ రేంజ్ స్టార్ స్టేటస్ ని ఎంజాయ్ చేస్తున్నాడో మనమంతా చూస్తూనే ఉన్నాం. ఆయన ఫ్లాప్ సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద బ్రేక్ ఈవెన్ మార్కుని దాటి సూపర్ హిట్స్ గా నిలుస్తున్నాయి. ఈ రేంజ్ స్టార్ స్టేటస్ ఉన్న విజయ్ సినిమాలను వదిలేస్తున్నాడు అనే వార్త విజయ్ ఫ్యాన్స్ కంటే కూడా, తమిళ థియేటర్స్ ఓనర్స్ ని శోకసంద్రం లోకి నెట్టేసింది.
ఎందుకంటే తమిళం లో ప్రస్తుతం ఉన్నది కేవలం ముగ్గురు స్టార్ హీరోలు మాత్రమే. ఒకడు విజయ్, మరొకడు అజిత్, ఇంకొకడు సూపర్ స్టార్ రజినీకాంత్. వీళ్ళ ముగ్గురిలో ఎవరు సినిమాలను ఆపేసిన థియేటర్ వాళ్లకు భారీ నష్టం. ఒక్కమాటలో చెప్పాలంటే థియేటర్స్ మూత పడే పరిస్థితి. అలాంటిది విజయ్ ఇప్పుడు సినిమాలు పూర్తిగా మానేస్తున్నాడు అని వార్త రావడంతో వాళ్ళు చాలా బాధపడుతున్నారు. కనీసం రెండేళ్లకు ఒక్క సినిమా అయినా చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు.